‘స్థానిక’ రిజర్వేషన్లపై ఉత్కంఠ
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:14 AM
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులో గా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో గ్రామాల్లో చర్చ రాజకీయ సందడి మొదలైంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులో గా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో గ్రామాల్లో చర్చ రాజకీయ సందడి మొదలైంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేక కొత్తగా రిజర్వే షన్లు ప్రకారం నిర్వస్తారా అనే ఉత్కంఠ నెలకొన్నది. అలాగే ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వ హిస్తారా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహి స్తారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.
గ్రామపంచాయతీలో పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి మొదటి వారంతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం జూలైలో ముగిసింది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీసీ కుల గణన చేపడతా మని హామీ ఇచ్చింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు గడిచిన ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో కుల గణన చేపట్టారు. ఈ సర్వేలో బీసీలు ఇతర వర్గాల కంటే 56 శాతానికి పైగా ఉన్నారని తేలింది. సర్వే ఫలి తాలు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన సర్వే ఫలితాల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కల్పించాలని బిల్లు చేసి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. దీంతో అలాగని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి పంపించిన బిల్లుపై జీవో జారీ చేయ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవ డంపై పలువురు మాజీ సర్పంచులు గతేడాది హైకోర్టును ఆశ్రయించడంతో వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు రెండు రోజుల క్రితం తుది తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిం చింది. దీంతో ఎన్నికలు మూడు నెలల్లోగా జరిగే అవకాశాలు ఉండడంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.
ఫ రొటేషన్ ప్రకారమే రిజర్వేషన్లు..
గత ప్రభుత్వ హయాంలో 2018లో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి నూతన చట్టాన్ని తీసుక వచ్చింది. ఈ చట్టంలో ఆయా పదవుల రిజర్వేషన్లను పదేళ్లపాటు కొనసాగించాలని పేర్కొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్‌లో సవరణ చేపట్టింది. రిజర్వేషన్లను ఐదు సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ మార్చాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రతి ఎన్నికల్లో ఆయా పదవులకు కేటాయించిన రిజర్వేషన్లు రొటేషన్ ప్రకారం మారే అవకాశాలున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 13 శాతం వరకు, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఆ లెక్కలు ఏమైనా మారతాయా లేదా అనే చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా గ్రామాల్లో బీసీ వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయ కులు బీసీ రిజర్వేషన్‌లో కాకపోతే జనరల్ స్థానాల్లో పోటీపడేందుకు సిద్ధమేనని ముందుకు వెళ్తున్నారు.
ఫ ఏవీ ముందు...
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ప్రభు త్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనే విషయమే ఉత్కంఠ నెలకొన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో ముడిపడి లేకపోవడంతో దానికంటే ముందు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకే మొగ్గు చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనబడుతున్నది. ఈ ఎన్ని కలు ఆయా రాజకీయ పార్టీల గుర్తులపై జరగను న్నాయి. ఎన్నికల్లో సత్తా చాటితేనే అధికార పార్టీ బలం ఏమిటో తెలియనున్నందున మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్నది. వీటిని కైవసం చేసుకుంటేనే గ్రామపంచాయతీలను తమ వశం చేసుకోవచ్చనే ఒక అంచనాకు వచ్చినట్లుగా కనబడుతున్నది. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో ముందుగా గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.