తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉద్యమాలకు స్ఫూర్తి..
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:25 AM
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పలు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పలు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఇల్లంతకుంట నుంచి గాలిపల్లి గ్రామంలోని కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి స్తూపం వరకు వాహన ర్యాలీని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ జండా ఊపి ప్రారంభించగా, ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా మంద అనీల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటమే రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది ముస్లింలు చిత్రహింసలకు గురయ్యారన్నారు. నాటి రజాకార్లు జర్నలిస్టు షోయబుల్లాఖాన్‌ను క్రూరంగా చంపారన్నారు. ప్రభుత్వాలు సాయుధ పోరాట విలీనదినోత్సవాన్ని ఎందుకు ధైర్యంగా జరుపడం లేదో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛందంగా జరిగిన పొరాటాన్ని కొంతమంది కావాలని మతం రంగు పులుముతున్నారని విమర్శించారు. రానున్న తరాలకు తెలంగాణ వీరచరిత్ర అందకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ఉచ్చులో పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంటలో బద్దం ఎల్లారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లాకార్యదర్శి మంద సుదర్శన్, కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, కేవీ అనసూర్య, కడారి రాములు, మీసం లక్ష్మన్, మంద అనీల్, మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు సావనపెల్లి మల్లేశం, భూంరెడ్డి, పెండల ఆదిత్య, బండారి చందులతో పాటు వివిద గ్రామాల రైతులు, కార్మికులు పాల్గొన్నారు.