Share News

హెచ్‌ఎంఎస్‌తో తెలంగాణ జాగృతి ములాఖత్‌...!

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:12 AM

హెచ్‌ఎంఎస్‌తో తెలంగాణ జాగృతి కలిసి పని చేసేందుకు మంతనాలు పూర్తయ్యాయి.

హెచ్‌ఎంఎస్‌తో తెలంగాణ జాగృతి ములాఖత్‌...!

గోదావరిఖని, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎంఎస్‌తో తెలంగాణ జాగృతి కలిసి పని చేసేందుకు మంతనాలు పూర్తయ్యాయి. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌పై పోరుబాటకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్యాచరణ రూపొందిస్తోంది. బీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ళు కవిత కొనసాగారు. ఈ క్రమంలో ఆమె సింగరేణిలోని 11ఏరియాల్లో కేడర్‌ను ఏర్పాటు చేసుకొంది. కవితకు, బీఆర్‌ఎస్‌కు మధ్య కొన్ని నెలలుగా కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టీబీజీకేఎస్‌ బాధ్యతలు అప్పగించింది. దీనికి కౌంటర్‌గా కవిత సింగరేణిలో కొత్త రాజకీయానికి తెరలేపుతోంది.

జాతీయ కార్మిక సంఘం హెచ్‌ఎంఎస్‌కు అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌తో కలిసేందుకు కవిత సిద్ధపడింది. గత నెల 30న హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌తో హైదరాబాద్‌లో ఆమె చర్చించినట్టు తెలిసింది. సింగరేణిలో జాగృతికి సంబంధించిన ప్రతినిధులను, కేడర్‌ను హెచ్‌ఎంఎస్‌తో కలిసి నడిపేందుకు ప్రాథమికంగా అవగాహన జరిగినట్టు తెలిసింది. ఈనెల 10న సింగరేణిలోని 11 డివిజన్ల నుంచి సింగరేణి జాగృతి ప్రతినిధులు, హెచ్‌ఎంఎస్‌ అన్ని డివిజన్ల ప్రతినిధులతో సమావేశం ఏర్పరచి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు రెండు సంఘాలు డివిజన్ల స్థాయి నుంచి సన్నద్ధమవుతున్నాయి. కవిత తన రాజకీయ అస్తిత్వ నిర్మాణంలో భాగంగా అనుబంధంగా ఒక జాతీయ కార్మిక సంఘాన్ని కలుపుకొని నడిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌కు మద్దతుగా కవిత జాగృతి బృందం పని చేయడం ఆమె రాజకీయ కార్యకలాపాల్లో హెచ్‌ఎంఎస్‌ భాగస్వామ్యం కావడంపై పరస్పర అంగీకారం కుదిరినట్టు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ప్రాంతం నుంచే కవిత అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ నుంచి ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కవిత నాయకత్వంలో హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘ నిర్మాణానికి చర్చల్లో కార్యాచరణ నిర్ణయించుకున్నట్టు హెచ్‌ఎంఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 10న సింగరేణి జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కలిసి పని చేస్తాయా, హెచ్‌ఎంఎస్‌లో సింగరేణి జాగృతిని విలీనం చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. హెచ్‌ఎంఎస్‌ నుంచి రియాజ్‌ అహ్మద్‌కు జేబీసీసీఐలో కూడా సభ్యత్వం ఉండడం, జాతీయ కార్మిక సంఘంగా సింగరేణిలో హెచ్‌ఎంఎస్‌ కేడర్‌ కలిగి ఉండడం, ఎమ్మెల్సీ కవితకు సైతం సింగరేణి వ్యాప్తంగా ఎంతో కొంత కేడర్‌ ఉండడం, ఈ రెండు వర్గాల కలయిక ప్రతిపాదనలకు ప్రాధాన్యం పెరిగింది. ఇదంతా టీబీజీకేఎస్‌కు ప్రత్యామ్నాయంగా సింగరేణిలో కవిత తన బలాన్ని పెంచుకోవడానికేనని పలువురు పేర్కొంటున్నారు. ఈనెల 30, 31తేదీల్లో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో హెచ్‌ఎంఎస్‌ 42వ మహాసభలను నిర్వహిస్తున్నది. ఈ మహాసభలకు జాగృతి ప్రతినిధులతోపాటు కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. హెచ్‌ఎంఎస్‌ అఖిల భారత సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌గా మారనున్నట్టు హెచ్‌ఎంఎస్‌ నాయకులు చెబుతున్నారు. హెచ్‌ఎంఎస్‌, కవిత వర్గానికి ఈనెల 10న జరిగే ప్రతినిధుల భేటీలో అంగీకారం కుదిరితే హెచ్‌ఎంఎస్‌ మహాసభల్లో కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకునే అవకాశాలను చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్‌ఎంఎస్‌ జాతీయ నాయకుడిగా కొనసాగుతూ టీఆర్‌ఎస్‌ అనుబంధంగా కొంత కాలం పని చేశారు. కొన్ని సందర్భాల్లో సింగరేణి కార్మిక పోరాటాలు, తెలంగాణ పోరాటాల్లో టీఆర్‌ఎస్‌, హెచ్‌ఎంఎస్‌, టీబీజీకేఎస్‌ కలిసి పని చేసిన చరిత్ర కూడా ఉన్నది. ఏది ఏమైనా కవిత తీసుకున్న పొలిటికల్‌ ’కౌంటర్‌’ సింగరేణి కేంద్రంగానే బీఆర్‌ఎస్‌పై మొదలు కానున్నది.

Updated Date - Aug 08 , 2025 | 01:12 AM