దేశానికే తెలంగాణ దిక్సూచి
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:04 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని మంత్రి ఎగురవేశారు.
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా జగిత్యాల
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జగిత్యాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని మంత్రి ఎగురవేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించి, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కల నేరవేర్చేందుకు జిల్లాలో 10,659 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఫ 80,515 మంది రైతులకు రుణమాఫీ..
ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణ మాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 80,515 మంది రైతులకు రూ. 721.74 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అన్నం పెట్టే రైతన్నను ఆదుకొనే లక్ష్యంతో రైతు భరోసా సహాయాన్ని ఎకరాకు రూ. 12 వేల చొప్పున 2,25,406 మంది రైతులకు 243.32 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని వివరించారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేసి 25,672 మంది రైతుల వద్ద ధరఖాస్తులు స్వీకరించ డంతో పాటు పరిష్కార పక్రియను వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 37,943 మందికి నూతన రేషన్ కార్డులను జారీ చేశామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో 1,67,154 మందికి జాబ్ కార్డులు జారీ చేసి 11.12 లక్షల పనిరోజులు కల్పించి ఉపాధి చూపించామన్నారు.
ఫ రూ. 309 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు..
గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా యాసంగి సీజన్‌లో జిల్లాలో 131 కొనుగోలు కేంద్రాల్లో 24,246 మంది రైతుల ద్వారా 309.18 కోట్ల విలువ గల 13,32,667 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించి రైతులకు అండగా నిలిచామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జగిత్యాల జిల్లా నాలుగో స్థానం సాధించడం గొప్ప విషయమన్నారు. 744 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 52 వేల మంది విద్యార్థులకు నిత్యం నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు రోగులకు రూ.46.20 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించి నిరుపేదలకు అండగా నిలిచామన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన 60 మంది విద్యార్థులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందగా, గ్రూప్-1కు ఏడుగురు అభ్యర్థులు మేయిన్స్‌కు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 12,037 మంది గర్భిణిలు, బాలింతకు, 12,680 మంది చిన్నారులకు అనుబంధ పోషకాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో నూతనంగా మరో 67 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు 7.56 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు.
ఫ దివ్యాంగులకు అండగా ప్రభుత్వం..
దివ్యాంగులకు 66 రెట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు, 32 ల్యాప్‌టాప్‌లు, రెండు బ్యాటరీ ఆపరేటేడ్ ఆటోలు, 172 ట్రై సైకిళ్లు ఇవ్వడంతో పాటు 44 మందికి రూ. 25 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేశామని వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వాహణకు ఇప్పటి వరకు రూ. 64.84 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో 100 శాతం మొక్కలు నాటి నర్సరీల్లో మరో 42.67 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టామన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 461 యూనిట్లకు గాను రూ.10.21 కోట్లు మంజూరు చేయడంతో పాటు 53 మహిళా గ్రూపులకు 9.14 కోట్లు కేటాయించామన్నారు. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 51,68,000 మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవడంతో వారికి రూ. 257.63 కోట్లు లభ్ధి చేకూరిందని వివరించారు. జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ లత, మంత్రి లక్ష్మణ్‌కుమార్ సతీమణీ కాంతకుమారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.