ఉపాధ్యాయుల ‘సర్దుబాటు’ వివాదం
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:53 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్న ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ వైపు పాఠశాలలు పునః ప్రారంభం కాలేదు.. విద్యార్థుల ప్రవేశాలపై స్పష్టత రాలేదు.. మరోవైపు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈనెల 13వ తేదీ లోపు ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ ప్రాతిపదికన చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
జగిత్యాల, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్న ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ వైపు పాఠశాలలు పునః ప్రారంభం కాలేదు.. విద్యార్థుల ప్రవేశాలపై స్పష్టత రాలేదు.. మరోవైపు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈనెల 13వ తేదీ లోపు ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ ప్రాతిపదికన చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సమయంలో సర్దుబాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోతామని చెబుతున్నారు. తక్షణమే ఉత్తర్వులను రద్దు చేయాలని, కనీసం జూన్ 30 వరకు వచ్చిన ప్రవేశాల ఆధారంగా సర్దుబాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 820 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో గత విద్యా సంవత్సరం వరకు 58,676 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది ఉన్నారు. 4,061 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సగటున 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు బోధన బాధ్యతలు చేపడుతున్నారు.
ఫఇవీ నిబంధనలు..
మొదటి ప్రాధాన్యం పంచాయతీ పరిధి, తర్వాత స్కూల్ కాంప్లెక్స్, ఆ తర్వాత మండలం, అనంతరం జిల్లా పరిధిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాలనే నిబంధనలున్నాయి. పరస్పర బదిలీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమివ్వొద్దు. ఈ ప్రక్రియలో గత యూడైస్ వివరాలను ప్రతిపాదికగా తీసుకోనున్నారు. 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఒకరు, 60 లోపు ఇద్దరు, 90 లోపు ముగ్గురు, 120 లోపు నలుగురు, 150 వరకు అయిదుగురు, 200 లోపు విద్యార్థులుంటే ఆరుగురు ఉపాధ్యాయులుండాలని, 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఫఆచరణలో సాధ్యం కాదంటున్న ఉపాధ్యాయులు..
విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 60 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారు. కానీ ఇది ఆచరణలో సాధ్యం కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులను ఇద్దరు ఎలా బోధిస్తారని, విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుందని ఉపాధ్యాయ వర్గాలు వాదిస్తున్నాయి. బోధనతో పాటు అనేక రిపోర్టులు, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుందని, ఒకరు వాటికే సరిపోతారని అంటున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పదోన్నతులు, బదిలీలు, నూతన డీఎస్సీతో పాటు 2008 అభ్యర్థులను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవడంతో సర్దుబాటు అవసరం అంతగా లేకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
సర్దుబాటు ప్రక్రియ వాయిదా వేయాలి
-బోయినిపల్లి ఆనంద్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులు జూన్ నెలాఖరు వరకు వాయిదా వేయాలి. జిల్లాలో ప్రతీయేటా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం బటిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. జూన్ 18వ తేదీ వరకు బడిబాటలో నూతన ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ నెలాఖరు వరకు ప్రవేశాలను ఆధారంగా చేసుకొని సర్దుబాటు ప్రక్రియ చేపడితే ఫలితం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం
-తులసి ఆగమయ్య, టీఎస్ యూటీఎఫ్ నాయకులు, జగిత్యాల
పాఠశాలల ప్రారంభం వరకు విద్యార్థుల సంఖ్య ఎంత ఉండబోతుందనేది పరిగణనలోకి తీసుకోకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు ఉపక్రమించడం సరికాదు. ప్రస్తుతం విద్యాశాఖ చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. బడిబాట పూర్తయిన తర్వాత విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు జరపాలి. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకు పలువురు ఉపాధ్యాయులు వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్నారు. పలువురు ఉపాధ్యాయులను గత విద్యాసంవత్సరం చివరి వర్కింగ్ రోజు రిలీవ్ చేయడం జరగలేదు. సంబంధిత ఉపాధ్యాయులు ఇప్పటికీ వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తాం.
జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు ఇలా..
-----------------------------------------------------------------------------------------------------------------------
స్కూల్ కేటగిరి............................పాఠశాల సంఖ్య.........విద్యార్థుల సంఖ్య...ఉపాధ్యాయుల సంఖ్య...నిష్పత్తి
-----------------------------------------------------------------------------------------------------------------------
ప్రాథమిక పాఠశాలలు................515................................18,097................................1,188................................15:1
ప్రాథమికోన్నత పాఠశాలలు......85...................................4,663..................................432...................................10:1
ఉన్నత పాఠశాలలు.......................220................................35,916................................2,441................................14:1
-----------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం................................................820................................58,676................................4,061................................14:1
-----------------------------------------------------------------------------------------------------------------------