Share News

ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని ముట్టడించిన టీబీజీకేఎస్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:53 AM

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్‌ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు.

ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని ముట్టడించిన టీబీజీకేఎస్‌
జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు

- కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

గోదావరిఖని, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్‌ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం టీబీజీకేఎస్‌ పనిచేస్తుందన్నారు. సింగరేణిలో పర్మినెంట్‌ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని, రోజురోజుకు కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతుందని, దీంతో ఆర్థికంగా కార్మికులను దెబ్బకొట్టేందుకు సంస్థ ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో భవిష్యత్‌లో ప్రభుత్వరంగ సంస్థల ఉనికికే ప్రమాదమన్నారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, రామగుండం, బెల్లంపల్లి, కొత్తగూడెం రీజియన్‌లో కార్మిక కాలనీలకు రక్షిత మంచినీటిని అందించాలన్నారు. సింగరేణిలో అమలవుతున్న మెడికల్‌ రెఫరల్‌ విధానాన్ని సమీక్షించాలని, కార్మికులకు ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జెన్‌కో నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. బొగ్గు బ్లాకుల వేలం పాటలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని, దీంతో సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఓట్లతో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాల సంక్షేమాన్ని మరిచారని, కార్మికుల మెరుగైన జీవన విధానం కోసం ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి, నాయకులు నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్‌, చెల్పూరి సతీష్‌, సంపత్‌రెడ్డి, రాజేశం, ఐ సత్యం, చంద్రయ్య, వాసర్ల జోసఫ్‌, చెలుకపెల్లి శ్రీనివాస్‌, రమేష్‌, శశాంక్‌, వెంకటేష్‌, శేషగిరి, తిరుపతి, రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:53 AM