టాస్క్‌ఫోర్స్ సీఐ రవీందర్‌పై వేటు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:38 AM
టాస్క్‌ఫోర్స్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న రవీందర్‌పైౖ వేటు పడింది. సీఐ రవీందర్‌ను ఐజీకి అటాచ్డ్ చేస్తూ శనివారం రాత్రి కరీంనగర్ సీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- ఐజీకి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
- ‘లీక్’లు, అవినీతిపై కొనసాగుతున్న విచారణ
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): టాస్క్‌ఫోర్స్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న రవీందర్‌పైౖ వేటు పడింది. సీఐ రవీందర్‌ను ఐజీకి అటాచ్డ్ చేస్తూ శనివారం రాత్రి కరీంనగర్ సీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపి, సామాన్యులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా బదిలీలు లేకుండా ఆ విభాగంలో పాతుకుపోయిన సిబ్బంది, కొందరు అధికారులు అవినీతికి తెరలేపారనే విమర్శలు వచ్చాయి. దాడులకు సంబంధించి ముందస్తుగా సమాచారాన్ని అక్రమార్కులకు అందజేశారనే ఆరోపణలున్నాయి. దీంతో పోలీస్ బాస్ ప్రత్యేక విచారణ జరిపించి నాలుగు రోజుల కిందటే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్‌ఐతోపాటు తొమ్మిది మందిపై బదిలీ వేటు వేశారు. తాజాగా టాస్క్‌ఫోర్స్‌లో సీఐగా పని చేస్తున్న రవీందర్‌పై కూడా వేటు పడింది. సీఐని ఐజీకీ అటాచ్డ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ లీక్ వీరులు, ఇసుక ముడుపులపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మరో అధికారి ప్రమేయంపై కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇసుక వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతున్నది. మానకొండూర్ నియోజకవర్గంలోని పలువురు పోలీసు అధికారులు ఇసుక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు అందాయని తెలిసింది.
ఫ మరో విభాగంపైనా పోలీస్ బాస్ దృష్టి
టాస్క్‌ఫోర్స్‌తో పాటు మరో నిఘావిభాగంలో కూడా అవినీతిపై ఆరోపణలు పోలీస్‌బాస్‌కు అందాయని, దీనిపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విభాగం కొన్ని దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుఇంది. వెరిఫికేషన్ సమయంలో భారీగా డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రిమినల్ కేసులున్నాయా? లేవా? అనేది వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిఉండగా అందుకు విరుద్దంగా చిన్న చిన్న సాంకేతిక కారణాలను చూపుతూ రిజెక్ట్ చేయటం వంటివి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చాయి. దీనిపై కూడా పోలీస్‌బాస్ రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ విభాగంలోనూ భారీ ప్రక్షాళన జరిగే అవకాశముంది. ప్రస్తుతం సెలవులో ఉన్న పోలీస్ బాస్ తిరిగి రాగానే చర్యలకు ఉపక్రమించే అవకాశముంది.