మద్యం దుకాణాలకు సిండికేట్ల గాలం
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:03 AM
జిల్లా వ్యాప్తంగా కొత్తగా మద్యం షాపులు వచ్చిన వారు నిర్వహణ భారమవుతుందని, ఇతరత్రా కారణాలతో ముందస్తుగా పాత లిక్కర్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. పాత మద్యం వ్యాపారులకే కొత్తగా డీల్ కుదుర్చుకొని డబ్బులు తీసుకొని తమకు దక్కిన లైసెన్స్‌లను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి వచ్చిన మద్యం దుకాణాలను ఇతరులకు అప్పగించి రూ.3లక్షల దరఖాస్తు ఫీజుతో పాటు రూ.50 లక్షల నుంచి రూ.1.25కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
- చేతులు మారుతున్న వైన్ షాపులు
- లక్కీ డ్రాలో దక్కించుకున్న వారికి భారీ మొత్తంలో ఆఫర్
- రూ. 50 లక్షల నుంచి రూ. 1.25 కోట్ల వరకు డిమాండ్
జగిత్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కొత్తగా మద్యం షాపులు వచ్చిన వారు నిర్వహణ భారమవుతుందని, ఇతరత్రా కారణాలతో ముందస్తుగా పాత లిక్కర్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. పాత మద్యం వ్యాపారులకే కొత్తగా డీల్ కుదుర్చుకొని డబ్బులు తీసుకొని తమకు దక్కిన లైసెన్స్‌లను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి వచ్చిన మద్యం దుకాణాలను ఇతరులకు అప్పగించి రూ.3లక్షల దరఖాస్తు ఫీజుతో పాటు రూ.50 లక్షల నుంచి రూ.1.25కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోని 71 వైన్స్‌షాప్‌లకు దరఖాస్తులు ఆహ్వానించి లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. 2023-25కు గాను వైన్స్ షాపుల గడువు నవంబరు 31 వరకు ఉంది. డిసెంబరు 1 నుంచి కొత్త వైన్స్ షాపులు ప్రారంభమవుతాయి.
ఫజిల్లాలో 71 మద్యం దుకాణాలు
జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. జగిత్యాల సర్కిల్ పరిధిలో 28 దుకాణాలు, ధర్మపురి సర్కిల్ పరిధిలో 18 దుకాణాలు, మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో 25 దుకాణాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 71 మద్యం దుకాణాలకు గాను గౌడ కులస్థులకు 14 దుకాణాలు, ఎస్సీ సామాజిక వర్గానికి 8 దుకాణాలను, 49 దుకాణాలను జనరల్‌కు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 71 మద్యం దుకాణాలకు గాను 1,967 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.59.01 కోట్లు ఆదాయం సమకూరినట్లయింది. గత నెల 27న జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల కేటాయింపు జరిపారు. నూతనంగా మద్యం దుకాణాల లైసెన్స్‌లు వచ్చిన వారు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించారు. కొత్త వైన్ షాపులకు మద్యాన్ని నవంబరు30న అందజేస్తారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి షాపులను లైసెన్స్ పొందినవారు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే కొత్త మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపేందుకు సుమారు నెల సమయం ఉండడంతో నూతనంగా లైసెన్స్‌లు పొందిన వారు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఈ లైసెన్స్ పరిధిలోనే పలు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఖచ్చితంగా తాము లాభపడతామని ఊహిస్తున్న కొందరు మద్యం వ్యాపారులు లైసెన్స్ హక్కుదారులను మచ్చిక చేసుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బు ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో 71 వైన్స్‌లలో ఇప్పటి వరకు సుమారు 30వరకు లైసెన్స్ హక్కుదారులకు, మద్యం వ్యాపారుల మధ్య ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది.
ఫఅప్లికేషన్ ఫీజుతో సహా గుడ్‌విల్‌కు ఒప్పందం
వైన్స్‌లను బట్టి అక్కడ ఆదాయం వచ్చే ప్రకారం మద్యం వ్యాపారులు ధరలను నిర్ణయిస్తున్నారు. వైన్స్ లైసెన్స్ రెండేళ్ల పాటు ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో వచ్చే ఆదాయాన్ని ఒకేసారి ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.1.25 కోట్లు చెల్లించడానికి మద్యం వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు సుమారు 30 వరకు వైన్స్‌లు ఒప్పందాలు కుదరగా మరో పది వైన్స్‌లకు లైసెన్స్‌దారులతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో లిక్కర్ వ్యాపారం బడాబాబుల చేతుల్లోకి వెళ్లి పోతుందనే చర్చ కొనసాగుతోంది. చాలా మంది లిక్కర్ వ్యాపారులు వైన్స్‌కు టెండర్లు వేసిన లక్కీడ్రాలో రాకపోవడంతో లైసెన్స్‌లు కొనుగోలుకు సిద్ధమయ్యారు. రానున్న సంవత్సరంలో పలు ఎన్నికలు జరగనుండడంతో వైన్స్‌లకు గిరాకీ పెరుగుతుందని లిక్కర్ వ్యాపారులు భావిస్తున్నారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలక వర్గాల ఎన్నికలు వరుసగా ఉండటంతో వీటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని బేరసారాలకు తెరలేపుతున్నారు. దీంతో లైసెన్స్‌లు అమ్మకాలు జోరు అందుకున్నాయి. వైన్స్‌లు పారంభమవడానికి ఇంకా సుమారు నెల సమయం ఉండటంతో అప్పటి వరకు చాలా మంది లైసెన్స్ హక్కుదారులు తమ లైసెన్స్‌లను అమ్మేస్తారని ప్రచారం నడుస్తోంది.