సర్వేయర్లు వస్తున్నారు..
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:49 AM
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది.
జగిత్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. భూములను కొలిచేందుకు సిబ్బంది కొరతను అధిగమించేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు 100 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిష్కారం కావడంతో పాటు భూములు విక్రయాలు, కొనుగోళ్లు ఇక పక్కాగా జరగనున్నాయి.
ఫసిబ్బంది కొరతతో సేవల్లో జాప్యం..
జిల్లాలో ఇరవై మండలాలు ఉండగా ఒక్కో మండలానికి ఇద్దరు సర్వేయర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 14 మంది ప్రభుత్వ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. వీరు వివాదంలో ఉన్న భూములను సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో భూ వివాదాలు పెరగడంతో మండలానికి ఒక్కో సర్వేయర్ కూడా లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వ, దేవాదాయ శాఖలకు సంబంధించి భూముల హద్దుల గుర్తింపులోనూ నెలల తరబడి సమయం పడుతోంది. రైతుల భూసర్వేలు ఆలస్యమై అవస్థలు పడుతున్నారు. రైతుల దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో అధికారులపైనా ఒత్తిడి పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 450 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల లైసెన్స్‌డ్ సర్వేయర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి రెండు విడతల్లో సుమారు 250 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించి శిక్షణ అందించింది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిలో లైసెన్సులు తీసుకునేందుకు వంద మంది రిపోర్టు చేశారు. దీపావళికి ముందు రోజే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వీరికి లైసెన్స్ పత్రాలు అందించారు. ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఆయా మండలాలకు కేటాయించనున్నారు.
ఫసర్వే ఆధారంగానే వేతనం..
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రభుత్వం ఎలాంటి వేతనాన్ని ప్రకటించలేదు. కేవలం వారు చేసిన భూమి సర్వే ఆధారంగానే మూడు విడతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేసన్ చేసుకునే సమయంలో స్లాట్ బుకింగ్‌లోనే సర్వేయర్ పేరు కూడా వస్తుంది. ఈ మేరకు లైసెన్స్‌డ్ సర్వేయర్ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ధారించి రెగ్యులర్ సర్వేయర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆతర్వాతే తహసీల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రెండు ఎకరాల్లోపు భూమి సర్వే చేస్తే రూ.వెయ్యి ఇవ్వనున్నారు. 2 నుంచి 5 ఎకరాలకు రూ.2 వేలు, 5 నుంచి 10 ఎకరాలకు రూ.5వేలు, 10 ఎకరాలకు పైగా ఉంటే రూ.5 వేల ఇవ్వనున్నారు. ఈ సొమ్ము కూడా మూడు విడతల్లో ఫీల్డ్ విజిట్‌కు 30శాతం, మ్యాప్ తయారీ తర్వాత 30 శాతం, సర్వేయర్‌కు నివేదిక ఇస్తే మరో 35 శాతం ఇవ్వనుండగా 5 శాతం డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామకం
-బీఎస్ లత, అదనపు కలెక్టర్
జిల్లాలో శిక్షణ పొంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 100 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లైసెన్స్‌లు అందించారు. వీరి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని మండలాలకు కేటాయిస్తాం. త్వరలో మరికొంత మంది సర్వేయర్లు అందుబాటులోకి వస్తారు. దాంతో జిల్లాలో వివాదాలు లేకుండా భూ విక్రయాలు జరుగుతాయి.