యూరియా అమ్మకాలపై నిఘా!
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:12 AM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరతతో రైతులు అల్లాడుతుండగా, జిల్లాలో ఆ పరిస్థితి తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. యూరియా అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేసింది. నెల వారీ కోటా ప్రకారం రావాల్సిన యూరి యాను ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి సరఫరా చేసుకుం టున్నారు.
- పక్కదారి పట్టకుండా ముమ్మర తనిఖీలు
- జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
- ఎకరానికి ఒక యూరియా బస్తా
- ఇప్పటి వరకు 21,581 టన్నుల యూరియా సరఫరా
- పక్కదారి పడుతున్న 140 బస్తాల యూరియా పట్టివేత
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరతతో రైతులు అల్లాడుతుండగా, జిల్లాలో ఆ పరిస్థితి తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. యూరియా అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేసింది. నెల వారీ కోటా ప్రకారం రావాల్సిన యూరి యాను ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి సరఫరా చేసుకుం టున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 21,581 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా కాగా, 18,991 టన్నుల యూరియాను రైతులకు విక్రయించారు. ప్రస్తు తం మార్కెట్‌లో 2,590 టన్నుల యూరియా అందు బాటులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకుగాను కలెక్టర్ సహ, జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకా ణాలను రెండు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే జిల్లా సరిహద్దుల నుంచి ఇతర జిల్లాలకు యూరియాను తరలించకుండా ఉండేందుకు నాలుగు చోట్ల మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని మండలం సుందిళ్ల బ్యారేజీ, అడవి సోమన్ పల్లి, ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పెద్దపల్లి నియో జకవర్గ పరిధిలోని ఓదెల మండలం గుంపుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్టులో పోలీస్, వ్యవసాయ, సహకార, రెవెన్యూ, మార్కెటింగ్, పంచా యతీరాజ్ శాఖలకు చెందిన ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఈ చెక్ పోస్టులు రెండు రోజుల నుంచి పని చేస్తున్నాయి. బుధ, గురువారాల్లో మంథని ప్రాం తం నుంచి మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు తరలిస్తున్న 140 యూరియా బస్తాలను సుందిళ్ల బ్యారేజీ, అడవి సోమన్‌పల్లి చెక్ పోస్టుల వద్ద వ్యవసాయ శాఖాధికారులు పట్టుకున్నారు.
ఫ జిల్లా అవసరాలకు 28,195 టన్నులు అవసరం..
వానాకాలం సీజన్‌లో జిల్లాలో రైతులు 2,76,076 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, తదితర పంటలను సాగు చేస్తారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 2020 నుంచి 2024 సంవత్సరం జిల్లాలో రైతులు వినియోగించిన యూరియా ప్రకారం 28,195 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుం దని అంచనా వేశారు. ఒకవేళ అంతకు మించితే 32,447 టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఎకరం వరి 2 బస్తాలు (45 కిలోలు), పత్తికి 3 బస్తా లు, మొక్కజొన్న పంటకు 3 బస్తాల యూరియా అవస రం ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,49,782 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, తదితర పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో వరి 2,00,316 ఎకరాలు, పత్తి 48,937 ఎకరాలు, మొక్కజొన్న 430 ఎకరాలు, తదితర పంటలను సాగు చేశారని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు మరో 15 వేల ఎకరాల్లో వరి నాట్లు వేయవచ్చని జిల్లా వ్యవసాయ శాఖాధికారి బత్తిన శ్రీనివాస్ చెబుతున్నారు. జిల్లాలో సాగయ్యే పంటలకు తోడు అదనపు అంచనాల ప్రకారం 32,447 టన్నుల్లో ఏప్రిల్ నెలలో 719 టన్నులు, మేలో 317 టన్నులు, జూన్‌లో 1816 టన్నులు, జూలైలో 4,978 టన్నులు, సెప్టెంబర్‌లో 13,607 టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత సాగుకు 28,195 టన్నుల యూరియానే ప్రామాణికంగా అధికారులు తీసుకుంటున్నారు. ఆ లెక్కన ఇప్పటి వరకు జిల్లాకు 21,581 టన్నుల యూరియా సరపరా అయ్యిందని, 18,991 టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారని, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల్లో 2,590 యూరియా నిల్వలు ఉన్నాయని, ఇంకా 6,614 అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు వస్తున్న యూరి యాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 60 శాతం వరకు కేటాయిస్తుండగా, ప్రైవేట్ వ్యాపా రులకు 40 శాతం యూరియాను ఇస్తున్నారు. అయితే రైతులు అవసరానికి మించి యూరియాను నిల్వ చేసు కుంటున్నారని భావిస్తున్న అధికారులు ప్రస్తుతం ఎకరానికి ఒక బస్తా యూరియా మాత్రమే విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం తీసుక వస్తేనే యూరియా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు వచ్చే యూరియాను ఏ రైతుకు ఎంత యూరియా విక్రయిం చారో ఒక రిజిష్టర్‌లో వివరాలు రాయాలని ఆదేశిం చారు. ఎరువుల విక్రయాల్లో మాత్రం ఆచితూచీ విక్రయించాలని చెబుతున్నారు. జిల్లాలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉన్న కారణంగా జిల్లాకు ముందుగా నిర్ధేశించిన కోటా ప్రకారం యూరియా సరఫరా అవుతున్నది. దీంతో రైతులకు పెద్దగా యూరియా కొరత లేకుండా పోతు న్నది. దీనికితోడు కొందరు రైతులు నానో యూరియా కూడా వాడుతుండడంతో కొరత ఏర్పడే అవకాశాలు లేవు. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయ కుండా, ఇతర జిల్లాలకు పక్కదారి పట్టకుండా ఉండేం దుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ సహ వ్యవసాయ శాఖాధికారులు ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. యూరియాను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.