చివరి గింజ కొనుగోలు వరకు రైతులకు అండగా..
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:03 AM
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులు, చివరి ధాన్యం గింజ కొనుగోలు వరకు రైతులకు అధికారులు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
సిరిసిల్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులు, చివరి ధాన్యం గింజ కొనుగోలు వరకు రైతులకు అధికారులు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఖరీఫ్ సీజన్-2025-26 వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీ కృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ముందుగా జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచవేశారని, దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఐకేపీ 156, పీఏసీఎస్ 72, డీసీఎంఎస్ ఒకటి, మెప్మా ఆధ్వ ర్యంలో 7 కేంద్రాలతో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం భించామని, సీసీఐ ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలు, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలుకు రెండు కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం, 17 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమా నికి అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 20 నెలల కాలం లో రాష్ట్ర వ్యాప్తంగా రూ లక్ష కోట్లకు పైగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు వెచ్చించిందని వెల్లడించారు. రూ 20వేల కోట్లకు పైగా రుణమాఫీ రైతులకు చేసిందని తెలిపారు. ఇప్ప టికే జిల్లాలోని ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దించుకొని సహకరించాలని, ధాన్యం కొను గోలు వివరాలు ఆన్‌లైన్ చేసి రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. లారీల కాంట్రాక్టర్లు తాము అగ్రిమెంట్ ప్రకారం వాహనాలు అందు బాటులో పెట్టీ, రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని, రవాణా శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సీఎంఆర్ ఇవ్వాలని, బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలని సూచించారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు, ఇతర రైతుల వివరాలు ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి, వారి పంట ఉత్పత్తులు విక్రయించుకోవడంలో ఇబ్బందులు తొలగించాలని సూచించారు. పంటల నమోదు ఆన్‌లైన్ పక్కాగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీసీఎస్‌ఓ చంద్ర ప్రకాశ్ ఆయా శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.