Share News

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:11 AM

2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనందిస్తోందని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ కమిషనర్‌ అంకిత పాండే అన్నారు.

 సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత
సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వర్క్‌షాపులో మాట్లాడుతున్న ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అంకిత పాండే

- ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అంకిత పాండే

కరీంనగర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనందిస్తోందని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ కమిషనర్‌ అంకిత పాండే అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశమందిరంలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో క్లస్టర్‌ స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో ఎంఎస్‌ఎంఈ, సెబీ, ఇండస్ట్రీ జీఎస్టీ, బ్యాంకింగ్‌ తదితర రంగాలకు చెందిన పలువురు అధికారులు మాట్లాడారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి ఉత్పత్తి ఇచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక మార్పులు, సంస్కరణలను తీసుకొచ్చిందని అన్నారు. వివిధ సంస్థల పరిశ్రమల ప్రతినిధులు ఎంఎస్‌ఎమ్‌ఈలు ఎదుర్కొంటున్న సమస్యల ను, పరిష్కార మార్గాలను, సలహాలు, సూచనలను అందించారు. ఎంఎస్‌ఎమ్‌ఈలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంఎస్‌ఎంఈల ఆవశ్యకత, అభివృద్ధి, వస్తువు ధరలు ఎలా తగ్గించి నాణ్యతగా ఎలా అందించాలనే అంశాలపై సంస్థలు, చిన్న పరిశ్రమల ప్రతినిధులకు ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ వర్క్‌షాపులో స్టేట్‌ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ సిహెచ్‌.రవికుమార్‌, సెబీ డిప్యూటీ మేనేజర్‌ వివిఆర్‌ ప్రసాద్‌, ఇండస్ట్రీ జెడి మధుకర్‌, ఎంఎస్‌ఎంఈ జెడి సిఎస్‌ఎస్‌ రావు, కెవిఐబి సీఈవో వెంకటేశ్వర్‌, ఎల్‌డిఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:12 AM