దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:22 AM
దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, సామజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వామపక్షాలు ప్రకటించాయి.
భగత్‌నగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, సామజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని వామపక్షాలు ప్రకటించాయి. కరీంనగర్ సీపీఐ కార్యాలయంలో వామపక్షాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథ నాయకులు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ కార్మికుల, గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తుల లాభాల కోసం పాలకులు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో ప్రతికూలమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. కొవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్‌లు వంటి చర్యలు ప్రజా వ్యతిరేకమైనవన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరించడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడికందుల సత్యం, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ, కొట్టే అంజలి పాల్గొన్నారు.
ఫ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో యువత పాల్గొని జయప్రదం చేయాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు జి తిరుపతి, యుగంధర్ పిలుపునిచ్చారు. వారు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు.