Share News

విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:04 AM

సైన్స్‌ను ఇష్టంగా నేర్చుకొని నూతన ఆవిష్కరణ దిశగా ఆలోచించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి విద్యార్థులకు పిలుపునిచ్చారు.

 విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవాలి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సైన్స్‌ను ఇష్టంగా నేర్చుకొని నూతన ఆవిష్కరణ దిశగా ఆలోచించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో స్థానిక పారమిత హెరిటేజ్‌ పాఠశాలలో మూడురోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య దశ నుంచే విద్యార్థులంతా శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. సైన్స్‌పట్ల ఆసక్తి పెంచుకొని మారుతున్న కాలానుగుణంగా నూతన ఆవిష్కరణల కోసం కృషిచేయాలని అన్నారు. జన విజ్ఞాన వేదిక వంటి సైన్స్‌ సంస్థల ద్వారా విద్యార్థులకు సైన్స్‌ ప్రాథమిక భావనలు, సైన్స్‌ పట్ల ఆసక్తి పెంపొందించుకోవచ్చని, విద్యార్థులంతా భావి శాస్త్రవేత్తలుగా సమాజ నిర్మాతలుగా వెలుగొందాలని అన్నారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సిహెచ్‌. మోహన్‌రావు మాట్లాడుతూ సమాజాభివృద్ధి సైన్స్‌ మీద ఆధారపడిఉందని అన్నారు. నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.ప్రసాదరావు మాట్లాడుతూ సైన్స్‌ ద్వారా ఆరోగ్య రంగంలో పెను మార్పులు వచ్చాయని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమేలా రాజేశ్వర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో పెంపొందిస్తున్న ఏకైక ప్రజాసైన్స్‌ ఉద్యమ సంస్థ, మూడనమ్మకాల నిర్మూలనకు, వైజ్ఞానిక అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న శాస్త్ర ప్రచార సంస్థగా జేవీవీ గుర్తింపు పొందిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఐదులక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో విజేతలైన 300 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఇ.ప్రసాదరావు, జేవివి రాష్ట్ర జిల్లా బాధ్యులు పి.ఆనంద్‌కుమార్‌, కోయ వెంకటేశ్వర్‌రావు, ఎ.రాంచంద్రయ్య, ఇ.శ్రీనాథ్‌, ఆర్‌.వరప్రసాద్‌, అందె సత్యం, సిహెచ్‌.రామరాజు, సంపతి రమేశ్‌, ఆర్‌.వెంకటేశ్వర్‌రావు, ఎన్‌.దేవేందర్‌, గంగారాం, కె.శంకర్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:04 AM