విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:35 AM
విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సూచించారు.
-హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి
ధర్మపురి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సూచించారు. ధర్మపురి మండలంలోని తన స్వగ్రామమైన తిమ్మాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) సహకారంతో రూ.6 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రహరీ, గేటు, ఆర్వో ప్లాంటును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అటా ప్రెసిడెంట్ జయంత్ చల్లతో కలిసి ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ తాను చదివిన స్కూల్ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందు కోసం అటా ముందుకు వచ్చి స్కూల్ ఆవరణలో ప్రహరీ నిర్మించి విద్యార్థులకు శుద్ధ జలం అందించేందుకు ఆర్వో ప్లాంటు నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. తన పెద్దనాన్న దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు, నాన్న దేవస్థానం దివంగత మాజీ చైర్మన్ జువ్వాడి సూర్యారావు ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్‌కుమార్ మాట్లాడుతూ స్కూల్‌ను అభివృద్ధి దశలోకి తీసుక వెళ్లేందుకు అటా కార్యవర్గ సభ్యులు మాధవరం విష్ణుప్రకాష్‌రావు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
అటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల మాట్లాడుతూ తాము కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్యూల్ బ్యాగులు, షూలు, టిఫిన్ డబ్బాలు, నోట్ బుక్స్ జడ్జి శ్రీదేవి, ఎమ్మెల్యే సంజయ్, అటా ప్రెసిడెంట్ జయంత్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అంతకు ముందు న్యాయమూర్తి శ్రీదేవి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అటా ప్రెసిడెంట్ జయంత్‌లను స్కూల్ పక్షాన సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఈవో రాము, సర్పంచ్ నలుమాసు పుష్పలత, అటా కార్యవర్గ సభ్యులు మాధవవరం విష్ణుప్రకాష్‌రావు, నిర్మల్ డీసీసీ మాజీ అధ్యక్షులు కుచాడి శ్రీహరిరావు, ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, అటా సభ్యులు కవిత చల్ల, పరమేష్, సతీష్‌రెడ్డి, భీంరెడ్డి, కాశి, రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్ పాల్గొన్నారు.