విద్యార్థుల యూనిఫామ్స్ నాణ్యంగా కుట్టాలి
ABN , Publish Date - May 03 , 2025 | 11:38 PM
విద్యార్ధుల యూనిఫామ్స్ నాణ్యంగా కుట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
తిమ్మాపూర్, మే 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధుల యూనిఫామ్స్ నాణ్యంగా కుట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మండలంలోని కొత్తపల్లిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డబుల్ స్టిచ్ చేయాలని, నిర్ణయించిన ధర కంటే రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తామని, నాణ్యతలో రాజీ పదొద్దని సూచించారు. సకాలంలో కుట్టడం పూర్తి చేయాలన్నారు. కుట్టు పని పూర్తి అయిన తరువాత మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రతి యూనిఫామ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. కొత్తపల్లి పరిధిలోని 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబందించిన యూనిఫామ్స్ ఇక్కడ కుట్టిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్డీఏ పీడీ వేణుమాధవ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ మోడల్ ఇల్లు పరిశీలన
తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఐదు లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇల్లును కలెక్టర్ పమేలా సత్పతి శనివారం పరిశీలించారు. మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న మోడల్ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఇళ్లను చూసి లబ్ధిదారులు ఒక ఆలోచనకు వస్తారన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని గ్రంథాలయాన్ని ఆమే పరిశీలించారు. ఇక్కడ ఉన్న ఖాళీ భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రం, క్యాంటిన్ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, గృహ నిర్మాణ సంస్ద పిడి గంగాధర్, తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.