పటిష్ట నిఘా
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:21 AM
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.
జగిత్యాల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలో 385 పంచాయతీలు ఉండగా 3,536 వార్డులున్నాయి. జిల్లా వ్యాప్తంగా 477 లొకేషన్లలో 3,536 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో 733 పోలింగ్ స్టేషన్లు సాధారణం కాగా, 733 పోలింగ్ స్టేషన్లు సున్నితమైనవిగా, ఒక పోలింగ్ స్టేషన్ అతి సున్నితమైనదిగా, 332 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 197 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయడానికి 89 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్‌పీ అశోక్ కుమార్‌లు నిర్వహించి సంపూర్ణ అవగాహణ కల్పించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు, రిజర్వ్ ఫోర్సు బలగాలు, నిఘా టీంలు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాయి.
ఫనగదు తరలింపుపై నజర్...
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు తరలింపుపై దృష్టి సారించింది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధు మిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున వారి రాక పోకలు సహా బ్యాంక్ అకౌంట్లపైనా దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ. 50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. జిల్లా, మండల, గ్రామ సరిహద్దులు, ప్రధాన రహదారులపై పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనిఖీ విభాగాలకు మండల తహసీల్లార్లను నోడల్ అధికారులుగా నియమించింది. సరైన ఆధారాలు (వస్తు కొనుగోలు-అమ్మకాలకు సంబంధించిన రసీదులు) చూపిస్తేసరి, లేదంటే ఆయా నగదును స్వాధీనం చేసుకోనుంది. పెద్ద మొత్తంలో మద్యం కొనుగోళ్లు, సరఫరా, బంగారం, వెండి వస్తువులు, చీరలు, ఇతర వస్తు కొనుగోళ్లపైనా నిఘా పెంచారు. ఇప్పటికే ఆయా దుకాణాల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఫ12 విభాగాలకు నోడల్ అధికారులు..
జిల్లాలో 385 పంచాయతీలు, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్, కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించింది. పోలింగ్‌కు ఎంతమంది సిబ్బంది అవసరం, ఎక్కడ విధులు నిర్వర్తించాలి, ఓటింగ్‌లో ఎవరు పాల్గొనాలి, కౌంటింగ్‌లో ఎవరు పాల్గొనాలి, తదితర పనుల పర్యవేక్షణకు మానవవనరుల విభాగాన్ని ఏర్పాటు చేసి నోడల్ అధికారిగా డీఈఓ రాము, ఎల్‌డీఎం రాముకుమార్‌లను నియమించింది. బ్యాలెట్ బాక్సులు ఎన్ని అవసరం, ఎలా సమకూర్చాలి, పోలింగ్ కేంద్రానికి ఎలా తరలించాలి, అటునుంచి స్ట్రాంగ్ రూమ్‌కు ఆ తర్వాత కౌంటింగ్ హాల్‌కు ఎలా తరలించాలి, వంటి పర్యవేక్షణకు బ్యాలెట్ బాక్సుల విభాగాన్ని ఏర్పాటు చేసి నోడల్ అధికారిగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సుదర్శన్‌ను నియమించారు. సిబ్బందిని పోలింగ్ బూత్‌లకు తరలింపు అటు నుంచి మళ్లీ వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చాల్సి ఉంది. ఇందుకు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. సిబ్బందికి శిక్షణకు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ రవి కుమార్‌ను,, మెటీరీయల్ మేనేజ్‌మెంట్ విభాగానికి జడ్పీ డిప్యూటీ సీఈవో నరేశ్‌ను నోడల్ ఆఫీసర్‌గా, బ్యాలెట్ పేపర్ల నిర్వహణకు జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల విభాగానికి జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్‌ను నోడల్ అధికారిగా, రిపోర్ట్స్, రిటర్న్స్ విభాగానికి అడిషనల్ డీఆర్‌డీవో మదన్‌మోహన్, విమల, శ్రీధర్‌లను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది.
ఫఅభ్యర్థుల ఖర్చుపై నిఘా...
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వారీగా ఖర్చు చేస్తుంటారు. వాహనాల ర్యాలీలు నిర్వహిస్తుంటారు. గ్రామాల పర్యటనకు వాహనాల వినియోగం, బ్యానరర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు సమకూర్చుకుంటారు. వీటితో పాటు వెంట తిరిగే కార్యకర్తలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మధ్యం, మాంసాహారంలను సమకూర్చుతుంటారు. లెక్కకు మించి ఖర్చు చేసే వారిపై గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఎంసీసీ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్‌గా జిల్లా ఆడిట్ అధికారి సుజాతను, పరిశీలక విభాగం నోడల్ ఆఫీసర్‌గా జిల్లా మెప్మా అధికారి దుర్గపు శ్రీనివాస్ గౌడ్‌ను, బ్యాలెట్ పేపర్ల నిర్వహణకు నోడల్ అధికారిగా జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్‌ను నియమించారు. వీరంతా సమీకృత కలెక్టరేట్ కేంద్రంగా ఆయా పనులను పర్యవేక్షిస్తుంటారు.
ఫజిల్లాలో ఏడు పోలీసు చెక్ పోస్టులు..
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏడు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జగిత్యాల - నిజామాబాద్ సరిహద్దు ప్రాంతమైన బండలింగాపూర్ గండి హనుమాన్, జగిత్యాల - నిర్మల్ సరిహద్దు మల్లాపూర్ మండలం ఒబులాపూర్, రాయికల్ మండలం బోర్నపల్లి, జగిత్యాల - సిరిసిల్ల సరిహద్దు కథలాపూర్ మండలం కలికోట, జగిత్యాల - కరీంనగర్ సరిహద్దు కొడిమ్యాల మండలం పూడూరు, జగిత్యాల - మంచిర్యాల సరిహద్దు ధర్మపురి మండలం రాయపట్నం, బీర్‌పూర్ మండలం కమ్మునూర్ ప్రాంతాల్లో పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నిరంతరం తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల నియమావళిని పాటించాలి
- సత్యప్రసాద్, కలెక్టర్
ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని వర్గాలు పాటించాలి. జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నగదు తరలింపుపై నిఘా ఉంచాము. నిబందనల ప్రకారం నగదు తరలింపు జరగకుంటే చర్యలు తప్పవు.
పకడ్బందీగా తనిఖీలు
- అశోక్ కుమార్, ఎస్పీ
జిల్లా సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాము. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయా సందర్బాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అక్రమంగా నగదు తరలింపుపై నిఘా ఉంచాము. నిబంధనలకు విరుద్దంగా నగదు తరలింపులు జరపవద్దు.