Share News

ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:13 AM

స్థానిక కూరగాయల, చికెన్‌, మటన్‌ మార్కెట్‌ను తాత్కాలికంగా బొక్కలవాగు కట్ట మీదకు తరలించడానికి మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు

మంథని, అక్టోంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక కూరగాయల, చికెన్‌, మటన్‌ మార్కెట్‌ను తాత్కాలికంగా బొక్కలవాగు కట్ట మీదకు తరలించడానికి మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. బొక్కలవాగు కట్ట పై ఉన్న ఓపెన్‌ జిమ్‌ సమీపంలో విశాలమైన స్థలంలో కూరగాయల, చికెన్‌, మటన్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయటానికి తాత్కాలికంగా తడకలతో షెడ్లు నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ మూడు విభాగాల్లో తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఉన్న వ్యాపారుల సంఖ్య ఆధారంగా బాక్స్‌లను మార్కింగ్‌ చేసి తడకలతో షెడ్లు నిర్మిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో షెడ్ల నిర్మాణం పూర్తయి తర్వాత వ్యాపారులను అక్కడి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ. 7 కోట్ల నిధులు ఏడాది క్రితం మంజూరయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌ ఉన్న స్థలంలో ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ అధునాతన భవనాన్ని నిర్మించడానికి చర్యలు చేపట్టనున్నారు. ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటీకి మార్కెట్‌లో వ్యాపారుల తరలింపు లేని కారణంగా నిర్మాణ పనుల ప్రారంభంలో జ్యాపం జరుగుతంది. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ మార్కెట్‌ తరలింపు, ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత మార్కెట్‌ను బొక్కలవాగు కట్టపైకి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారులు మాత్రం మార్కెట్‌ భవన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తమకు బస్టాండ్‌ లేదా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో తాత్కాలికంగా కూరగాయలు అమ్ముకోవటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బస్టాండ్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, గ్రౌండ్‌లో ఉంటే విద్యార్థుల విద్యా బోధనకు ఇబ్బందని మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు భావిస్తున్నారు. బొక్కలవాగు కట్టపై ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పట్ణణంలోని అన్ని వార్డుల ప్రజలు కట్ట పైకి వచ్చి కూరగాయలు, మాంసం కొనుగోలు చేయటానికి అనుకూలంగా కట్టకు జాయింట్‌ రోడ్డులు అనుసంధానంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మార్కెట్‌ తరలింపు కోసం వ్యాపారులు సహకరించాలని వారు కోరుతున్నారు. వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ తరలింపు అనంతరం మార్కెట్‌లోని ఇతర చిరు వ్యాపారుల అడ్డాలు, ప్రధాన రహదారి పక్కనే ఉన్న షాపుల తొలగింపు కోసం మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్‌ తరలింపుపై వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ. ఇంటిగ్రేటేడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణం కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 01:13 AM