Share News

బీసీ బిల్లు పేరుతో మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:23 AM

తెలంగాణ రాష్ట్రంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

బీసీ బిల్లు పేరుతో మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆమోదం ప్రకటించారన్నారు. బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దుతు ప్రకటించడం శోచనీయన్నారు. బీసీ బంద్‌ సందర్భంగా ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆదివారం సిరిసిల్లలో ప్రెస్‌మీట్‌ పెట్టి బీసీ బిల్లును బీజేపీ అడ్డుకుంటుందన్నారు. కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ 42శాతం బీసీ రిజర్వేషన్‌లో బీసీలు మాత్రమే ఉండాలని, పది శాతం ముస్లింలను చేర్చవద్దని గతంలోనే తన అభిప్రాయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు బీసీ నాయకులతో కలిసి బంద్‌ చేయడం సరైందికాదన్నారు. బీసీలను మభ్యపెట్టడం కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి పనులు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న రిజర్వేషన్‌ల ప్రకారం మంత్రి వర్గంలో 8 మంది బీసీలు మంత్రులుగా ఉండాలి.. మరీ ఎంత మంది మంత్రులు ఉన్నారో తెలుసుకోవా లన్నారు. మంత్రి పదవి కోసం ఆది శ్రీనివాస్‌ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన రూ 8వేల కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్స్‌ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ ఇంటిపైకి పోలీసులను పంపడాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సమర్థి స్తున్నారా లేక స్వాగతిస్తున్నారా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:23 AM