Share News

ఆపదలో అండగా

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:44 AM

రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదం, గొడవ, దాడులు, పేకాట, వ్యభిచారం, గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌, పోకిరీల వేధింపులు, ఎటువంటి సమస్య అయినా ఆపదలో గుర్తుకు వచ్చేది డయల్‌ 100 టోల్‌ఫ్రీ నెంబర్‌. డయల్‌ 100తో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగింది.

 ఆపదలో అండగా
డయల్‌ 100 కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుంటున్న సీపీ గౌస్‌ ఆలం

- డయల్‌ 100 టోల్‌ఫ్రీ కాల్‌తో పోలీసు సేవలు

- 10 నెలల్లో 43 వేల మందికి తక్షణ సాయం

- నేరాల నియంత్రకు ‘బ్లూ కోల్ట్స్‌ పెట్రోలింగ్‌‘

కరీంనగర్‌ క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదం, గొడవ, దాడులు, పేకాట, వ్యభిచారం, గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌, పోకిరీల వేధింపులు, ఎటువంటి సమస్య అయినా ఆపదలో గుర్తుకు వచ్చేది డయల్‌ 100 టోల్‌ఫ్రీ నెంబర్‌. డయల్‌ 100తో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగింది. ఏ చిన్న సమస్య వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా ‘డయల్‌ 100’ ఆపద్బాంధవుడిలా మారుతోంది. జిల్లా పోలీస్‌ శాఖ నిరంతర పర్యవేక్షణ, బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది అంకితభావం వెరసి గడిచిన 10 నెలల్లో (జనవరి 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు) ఏకంగా 43,105 మంది బాధితుల కాల్స్‌ స్వీకరించి వారికి పోలీసులు అండగా నిలిచారు. గతంలో పోలీస్‌స్టేషనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల నుంచి ఒక్క ఫోన చేస్తే చాలు పోలీసులు ఘటన స్థలంలో వాలుతున్నారు.

ఫ సమస్య ఏదైనా 100కు ఫోన

సమస్య ఏదైనా జనం డయల్‌ 100కు కాల్‌ చేస్తున్నారు. మొత్తం కాల్స్‌లో అత్యధికంగా 22,830 కాల్స్‌ చిన్న చిన్న తగాదాలు, న్యూసెన్స వంటి వాటికి సంబంధించినవే ఉన్నాయి. దీన్ని బట్టి గొడవ పెద్దది కాకముందే పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్‌ ఇచ్చి శాంతిభద్రతలను కాపాడుతున్నారని స్పష్టమవుతోంది.

ఫ ఫిర్యాదుపై మహిళల్లో చైతన్యం

మహిళా భద్రత విషయంలో జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సమస్య ఏదైనా మహిళలు, ఇప్పుడు ధైర్యంగా డయల్‌ 100ని ఆశ్రయిస్తున్నారు. గత పది నెలల్లో 5,,641 మంది మహిళలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల ఎంతోమంది మహిళలకు తక్షణ రక్షణ లభించడమే కాకుండా, నేరస్థులకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేయగలిగారు. అర్బన ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ డయల్‌ 100 సేవలు విస్తృతం అయ్యాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన కరీంనగర్‌ టూ టౌన-5,176, కరీంనగర్‌ వన టౌన-5,006 కాల్స్‌కు పోలీసులు రికార్డు స్థాయిలో సేవలు అందించారు. కరీంనగర్‌ నగర శివార్ల పరిధిలో కొత్తపల్లి-3,803, కరీంనగర్‌ రూరల్‌-3,484 కాల్స్‌తో ప్రజలు పోలీసు సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

ఫ అన్ని సమస్యలకు ఒకటే నెంబర్‌

కేవలం నేరాలే కాదు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రజలు అంబులెన్స కంటే ముందు డయల్‌ 100కే కాల్‌ చేస్తున్నారు. ఇలా 2,288 రోడ్డు ప్రమాద ఘటనల్లో పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అలాగే 561 ఆత్మహత్యాయత్న ఘటనల్లో సమయానికి స్పందించి నిండు ప్రాణాలను నిలబెట్టారు.

ఫ కొత్తపల్లి మండలం బావుపేటలో కుటుంబ గొడవలతో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సన్నీ(దయాసాగర్‌) అనే యువకుడిని కానిస్టేబుల్‌ విజయరావు రక్షించారు. గత జూన 1న డయల్‌ 100కు సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్‌, యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి అతన్ని సురక్షితంగా కిందకు దించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ విజయరావును అప్పటి ఎస్‌ఐ సాంబమూర్తి అభినందించారు.

ఫ. కుటుంబ సమస్యలతో అర్ధరాత్రి ఎల్‌ఎండీ డ్యామ్‌ వద్ద ఆత్మహత్యకు యత్నించిన వేల్పుల సంపత(39) అనే వ్యక్తిని బ్లూ కోల్ట్స్‌ హోంగార్డు మామిడిపల్లి శ్రీనివాస్‌ సమయస్ఫూర్తితో కాపాడారు. బాధితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను సీపీ గౌష్‌ ఆలం అభినందించారు.

ఫ డయల్‌ 100కు వచ్చిన కాల్స్‌

మొత్తం కాల్స్‌ 43,105

చిన్న సమస్యలు, న్యూసెన్స పరిష్కారం- 22,830

వ్యక్తిగత తగాదాల నివారణ- 8,754

మహిళలకు రక్షణగా- 5,641

ఆస్తి రక్షణలో-3,031

క్షతగాత్రులకు సాయం- 2,288

ప్రాణాలను కాపాడినవి- 561

ఫ డయల్‌ 100 ప్రజల రక్షణ కవచం

- పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం

డయల్‌ 100 అనేది కేవలం ఒక నెంబర్‌ కాదు, అది ప్రజల రక్షణ కవచం. న్యూసెన్స కాల్స్‌ ఎక్కువగా రావడం ఆందోళనకరం, డయల్‌ 100 సేవలు ప్రజల అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు కీలకం. మొత్తం డయల్‌ 100 కాల్స్‌లో సగానికిపైగా న్యూసెన్స, రిపీటెడ్‌ కాల్స్‌ నమోదవడం పోలీసు విభాగానికి భారంగా మారుతోంది. ఈ కాల్స్‌ వల్ల నిజమైన అత్యవసర ఫిర్యాదులపై స్పందనలో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉన్నది. డయల్‌ 100 సేవలను అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి.

Updated Date - Nov 22 , 2025 | 12:44 AM