Share News

పాత పద్ధతిలోనే ఎస్సెస్సీ పరీక్షలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:23 AM

పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు 20 మార్కులను యథావిధిగా కొనసాగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

పాత పద్ధతిలోనే ఎస్సెస్సీ పరీక్షలు

జగిత్యాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు 20 మార్కులను యథావిధిగా కొనసాగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తుండగా, విద్యాసంవత్సరం ప్రారంభ మై రెండు నెలలు గడిచిన తర్వాత విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై మరికొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం 2011 నుంచి 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్‌ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్‌ మార్కులు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేసి 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రతిపాదన చేసింది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు స్కూల్‌ యజమాన్యాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని గత యేడాది వెనక్కి తీసుకుంది. తాజాగా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఫఎన్‌సీఈఆర్‌టీ అభిప్రాయం మేరకే...

పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయడంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. సీబీఎస్‌ఈ పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్స్‌, 80 శాతం వార్షిక పరీక్షలకు మార్కులు కేటాయిస్తే తెలంగాణలో ఇంటర్నల్స్‌ను ఎలా రద్దు చేస్తారని ఇటీవల నిర్వహించిన వర్క్‌ షాప్‌లో రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. దీంతో విద్యాశాఖ అధికారులు పాత విధానాన్ని యథావిధిగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫజిల్లాలో 4,156 మంది పదో తరగతి విద్యార్థులు

జిల్లాలో ప్రభుత్వ, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, ప్రైవేటు పాఠశాలలతో కలిపి 219 హైస్కూల్స్‌ ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను 4,156 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో విద్యాశాఖ 100 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఉపాధ్యాయులంతా విద్యార్థులను సబ్జెక్టు వారీగా రెండు నెలలుగా 100 మార్కుల పేపరుకు సన్నద్ధం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విద్యాశాఖ 80 మార్కులకు రాత పరీక్షలు, 20 ఇంటర్నల్‌ మార్కులు అని తాజాగా ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ప్రభుత్వం వార్షిక పరీక్షలు, ఇంటర్నల్‌ మార్కులపై ఆదేశాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్ట పోయే ప్రమాదం ఉందని కొంత మంది ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు

-బైరం హరికిరణ్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత విద్యాశాఖ ఇంటర్నల్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నల్‌ విధానాన్ని రద్దు చేసి 100 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించాలి.

సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

-తిరుక్కోవెల శ్యామ్‌ సుందర్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పదో తరగతి పరీక్షలను పాత పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులు ఇంటర్నల్‌ మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం సరియైున నిర్ణయం తీసుకుంది.

వంద మార్కులకు పరీక్షలు నిర్వహించాలి

-బోయినిపల్లి ఆనందరావు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

పదో తరగతి వార్షిక పరీక్షలను వంద మార్కుల విధానంతోనే నిర్వహించాలి. ఇంటర్నల్‌ మార్కుల విధానం వల్ల ఫలితాలు సక్రమంగా రావడం లేదు. ఇంటర్నల్‌ మార్కుల విధానంపై పునరాలోచన చేయాలి.

Updated Date - Aug 20 , 2025 | 01:23 AM