Share News

క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:10 AM

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌) క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలి

కోనరావుపేట, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌) క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోనరావుపేట మండలం మర్రిమడ్ల ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 5వ రాష్ట్రస్థాయి గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సెలక్షన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో క్రీడా పోటీల నిర్వహణకు మంచి ఏర్పాట్లు చేసిన అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. రాష్ట్ర నలుమూలల నుంచి 1200 మంది పైగా విద్యార్థులకు క్రీడాపోటీలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. ఏకలవ్య పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత 740 కోట్ల రూపాయలు గిరిజన గ్రామ పంచాయతీలకు విడుదల చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ విప్‌ కోరిక మేరకు గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికి అదనంగా 10 కోట్లు రూపాయలు తప్పనిసరిగా మంజూరుచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పేదలకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో గురుకులాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గురుకులాల్లో ఉపాధ్యాయులు చెప్పే మాటలు పాటించాలన్నారు. చిన్నారులలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయుల అంతర్గత బదిలీలు, పదోన్నతుల కల్పన, గురుకులాల్లో 40 శాతం డైట్‌ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్‌ చార్జీలు, ప్రతి నియోజకవర్గ పరిధిలో 200 కోట్లతో యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం, అడ్వాన్స్‌డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ల ద్వారా ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించడం వంటి అనేక కార్యక్రమాలను విద్యాశాఖలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ ఈఎంఆర్‌ఎస్‌ క్రీడా పోటీలలో విద్యార్థులంతా ఉత్సాహంతో పాల్గొనాలని, రాష్ట్రం నుంచి అధికంగా క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని కోరారు. రాబోయే మూడు రోజుల పాటు ఈఎంఆర్‌ఎస్‌ క్రీడా పోటీల సందర్భంగా విద్యార్థులందరికీ మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడా పోటీల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈఎంఆర్‌ఎస్‌ సెక్రెటరీ సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ 5వ జాతీయ ఈఎంఆర్‌ఎస్‌ స్పోర్ట్స్‌ సెలక్షన్‌ మీట్‌ జరుగుతుందని, ఇందులో 300 మంది క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ ఈఎంఆర్‌ఎస్‌ క్రీడా పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 23 ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల నుంచి 1200 మంది బాలికలు వచ్చారని, 16 రకాల క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన మాలావత్‌ పూర్ణ మాట్లాడుతూ గురువుల పాఠశాలలో చదువుకున్న తాను ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించానన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నిర్దేశించుకున్న మంచి లక్ష్య సాధన కోసం కృషి చేస్తే సమాజం మొత్తం సహకారం అందిస్తుందన్నారు. అనంతరం మంత్రి, విప్‌, కలెక్టర్‌లను స్కూల్‌ యాజమాన్యం సన్మానం చేశారు. కబడ్డీ క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రాజు, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 01:10 AM