Share News

భూముల సర్వే వేగవంతం

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:14 AM

భూముల సర్వేలు సకాలంలో జరుగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకొని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

భూముల సర్వే వేగవంతం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

భూముల సర్వేలు సకాలంలో జరుగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకొని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే భూములను సర్వే చేసి మ్యాప్‌ను రూపొందించి ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగినంత సిబ్బంది లేకపోవడంతో భూసర్వే, మ్యాపింగ్‌లో జాప్యం జరగని పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో 13 మండలాలు, జిల్లా కార్యాలయంతో కలిపి 16 మంది సర్వేయర్లు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ద్వారా భూములు సర్వే చేయించే దిశగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి ఈనెల 19న ముఖ్యమంత్రి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. డిసెంబర్‌ మాసంలో వీరంతా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానున్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ద్వారా భూములు సర్వే చేయించినందుకు చెల్లించే ఫీజులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో భూముల సర్వేలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

మరో 55 మంది సర్వేయర్లకు పరీక్ష..

రాజన్న సిరిసిల్ల జిల్లా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు 66 మందిని నియమించారు. వీరితో పాటు మరో 55 మంది లైసెన్సుల కోసం పరీక్షలు రాశారు. అందులో ఎంపికైన వారిలో కూడా కొంతమంది జిల్లాలో పనిచేయనున్నారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో రిజిస్ట్రేషన్లు వేగవంతం అవుతాయి. ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నెంబర్లు, విస్తీర్ణంలాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. లైసెన్సులు సర్వేయర్లు అందుబాటులోకి వస్తే మ్యాప్‌లతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు సంబంధిత స్థలానికి సంబంధించిన మ్యాపులు తయారుచేసి పోర్టల్‌ లో అప్లోడ్‌ చేస్తారు. భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఎలాంటి హద్దు వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు.

భూభారతి దరఖాస్తులకు మోక్షం

ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 6787 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో భూ సమస్యలపై 6787 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, సాదా బైనామాలు, కోర్టు కేసులు, ఒకరి భూములు మరొకరిపై నమోదు కావడం, పెండింగ్‌ మ్యుటేషన్‌ తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించి 1393 దరఖాస్తులు, పెండింగ్‌ మ్యుటేషన్‌కు 295 దరఖాస్తులు, డీఎస్‌ పెండింగ్‌లో 404 దరఖాస్తులు వచ్చాయి. భూమి విస్తీర్ణం, చేర్పులు మార్పులు సంబంధించి 2093 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత జాబితాలో భూములు నమోదు అయినట్లు సవరించడానికి 270 దరఖాస్తులు వచ్చాయి. అసైన్డ్‌ భూములు, భూసేకరణ, ఇతర రికార్డులకు సంబంధించిన సమస్యలపై 3489 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలోనూ భూముల సర్వేకి సంబంధించిన వినతి పత్రాలు వస్తున్నాయి. సర్వేయరు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తేనే వీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు మాత్రమే సర్వేలు ఉండడంతో దరఖాస్తులకు సకాలంలో మోక్షం కలగడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల విధానంతో ప్రతిఘటన భూభారతి దరఖాస్తులతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఫీజులు

లైసెన్స్‌ సర్వేయర్ల ద్వారా జరిపే భూముల సర్వేకి సంబంధించి ప్రభుత్వం ఫీజులను కూడా ఖరారు చేసింది. రెండు ఎకరాలలోపు భూమి విస్తీర్ణాన్ని సర్వేచేసి మ్యాప్‌ రూపొందించడానికి రైతుల నుంచి రూ వెయ్యి వసూలు చేస్తారు. 2 నుంచి 5 ఎకరాల వరకు రూ రెండు వేలు, 5 నుంచి 10 ఏకరాల వరకు రూ.5వేలు, 10 ఎకరాల విస్తీర్ణం మించితే రూ 5వేలకు అదనంగా ప్రతి ఎకరానికి వీరు రూ 500 చొప్పున ఫీజు వసూలు చేస్తారు. ఇందులో ప్రభుత్వం ఐదు శాతం మినహాయించుకుని మిగిలిన 95 శాతం సర్వేయర్లకు చెల్లిస్తోంది. ప్రస్తుతం నాలుగు సర్వే నంబర్లలోపు భూమి విస్తీర్ణాన్ని సర్వే చేయడానికి ఆన్‌లైన్‌ ద్వారా రూ 275 ఫీజును వసూలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి కాకపోవడంతోనే పారదర్శకంగా ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రతి మండలానికి ఆరుగురు వరకు లైసెన్సులు సర్వేలను కేటాయించనున్నది. భూసర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ లేదా వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. భూయజమాని యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా చాలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌కు వెళ్తుంది. లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ సర్వే చేసి వివరాలను వెబ్‌పైట్‌లో ఉంచుతారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌కు మూడు దఫాలుగా సర్వేకుసంబంధించిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

Updated Date - Oct 29 , 2025 | 12:14 AM