Share News

పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:03 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతగా అందించే దిశగా నిరంతరం జిల్లా కలెక్టర్‌ నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వరకు పర్యవేక్షిస్తున్నారు.

పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి
భోజనం చేస్తున్న విద్యార్థులు

- పాఠశాలల్లో మధ్యాహ్న భోజన చార్జీల పెంపు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతగా అందించే దిశగా నిరంతరం జిల్లా కలెక్టర్‌ నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వరకు పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చార్జీలు సరిపోవడం లేదని తరచూ ఆందోళన దిగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం 2024 డిసెంబర్‌ 1 తేదీ నుంచి వర్తించే విధంగా వంట చార్జీలు పెంచింది. మధ్యాహ్నం భోజన నిర్వాహణకు సంబంధించి మూడు కేటగిరీలుగా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిదులు సమకూరుస్తుంది. పెరిగిన వంట చార్జీలతో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నిర్వాహకులకు కొంత ఊరటగా కలుగనున్నది.

జిల్లాలో 32 వేల మంది విద్యార్థులకు లబ్ధి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 667 ప్రభుత్వ ,ప్రైవేట్‌ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులు 79,747 మంది ఉన్నారు. ఇందులో బాలురు 39,147 మంది, బాలికలు 40,600 మంది ఉన్నారు. ఇందులో 511 ప్రభుత్వ పాఠశాలల్లో 32 వేల మంది విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించడానికి జిల్లాలో 635 ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. 833 మంది వంట చేసేవారు ఉన్నారు. విద్యార్థులకు సోమవారం కిచిడి. గుడ్డు, వెజిటేబుల్‌ కర్రీ. మంగళవారం అన్నం. సాంబారు. రాగి జావా. కూరగాయలు. బుధవారం అన్నం, ఆకుకూర పప్పు, వెజిటేబుల్‌, శుక్రవారం అన్నం, సాంబారు, గుడ్డు, వెజిటేబుల్‌ కర్రీ, శనివారం రాగి జావ, ఆకుకూర పప్పు, అన్నం వెజిటేబుల్‌ కర్రీ, విద్యార్థులకు అందిస్తున్నారు, ఏజెన్సీలకు పెరిగిన ధరలు ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం మెనూ చార్జీలను మూడు విభాగాలుగా పెంచింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒకరికి రూ 6.19, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 9.25 పెంచారు. 9,10 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 11.79 పెంచారు. గుడ్డుకు రూ 2.50 అదనంగా చెల్లిస్తున్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ 5.45 ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రూ 8.17 చెల్లించేవారు. పెరిగిన మెనూ చార్జీలతో మరింత నాణ్యతగా భోజనం అందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఇంటి నుంచే బాక్సులు

జిల్లాలో ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటున్నారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నా బియ్యం నాణ్యతగా లేకపోవడంతో అన్నం దొడ్డు కావడం, ముద్ద అవుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా నాణ్యత పాటించకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్‌ బాక్సులు తెచ్చుకుంటున్నారు. పౌష్ఠికాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 01:03 AM