ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - May 02 , 2025 | 12:51 AM
పదో తరగతిలో ఫెయిల్ అయిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదో తరగతిలో ఫెయిల్ అయిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 6,200 మంది విద్యార్థుల్లో 5,995 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫెయిల్ అయిన 205 మంది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వచ్చే నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థుల డాటా సేకరించాలన్నారు. ఇప్పటి వరకు ఉత్తీర్ణత సాధించలేని, పరీక్ష ఫీజు చెల్లించకుండా ఉండిపోయిన వారి వివరాలు సేకరించాలన్నారు. వారందరితో పరీక్ష ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీలు భవిత కేంద్రాలను తక్కువ విద్యార్థులు ఉండి గదులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లోకి మార్చాలన్నారు. వీలైనన్ని అంగన్‌వాడీలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు, కో-ఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, డీఈడీవో కృపారాణి, సీడీపీవోలు సబిత, శ్రీమతి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్‌ను అభినందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జిల్లాలో 2024-25 యాసంగి సీజన్‌లో సమస్యలు లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి,జిల్లా అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. జిల్లాలో యాసంగి సీజన్ 2024-25లో 99,408 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 14,344 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకాలు 90,632 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 8,756 మెట్రిక్ టన్నులు. వీటికి సంబంధించిన 100.54 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. సన్న రకాల వడ్లకు బోనస్ 4.38 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రతిపాదనలు పంపించారు.
ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి
సుభాష్‌నగర్: ప్రైవేటు ఆసుపత్రులు నిభందనలు తప్పక పాటించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సంబందించిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు ఆసుపత్రికి పార్కింగ్ సౌకర్యం ఉండాలన్నారు. అత్యవసరంగా పార్కింగ్ చేయాల్సి వచ్చే వాహనాలకు సెక్యూరిటీని నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, ఐఎంఏ కరీంనగర్ అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేష్, హెచ్‌ఈవో బాలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.