పంచాయతీల్లో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:50 AM
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనం కాపాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వచ్చేనెల 3నుంచి 11వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు చేస్త్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనం కాపాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వచ్చేనెల 3నుంచి 11వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు చేస్త్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్, మండల పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు డీపీవో అన్ని గ్రామ పంచాయతీలకు వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఫ 3 నుంచి 11 వరకు స్పెషల్ డ్రైవ్..
ఈ ప్రత్యేక కార్యక్రమం నవంబర్ మూడవ తేదీ నుంచి 11వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిరోజు గ్రామంలోని అన్ని వాడలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురికి కాలువలను పరిశుభ్రం చేయాలని పేర్కొన్నారు. అలాగే మురికి నీరు అంతా సాఫీగా దిగువకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్లకు తరలించాలని సూచించారు. గ్రామంలోఖాళీ స్థలాలు, ఫ్లాట్‌లలో ఉండే పిచ్చి మొక్కలను తొలగించాలని, చెత్తాచెదారం వేయకుండా చూడాలని, ఇందుకు అయ్యే ఖర్చును ఫ్లాట్ల యజమానుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించారు. పంచాయతీ ఆస్తులు అయిన పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, తెలంగాణ క్రీడ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పన్నులు, నల్లా కనెక్షన్ పన్నులు, దుకాణాల లైసెన్సుల ఫీజులు, తదితర పనులకు సంబంధించి బాకీ ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో 50శాతం, నవంబర్ నెలాఖరులోగా 100శాతం వసూళ్లు పూర్తిచేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో గల మాంసాహారం, చికెన్‌సెంటర్లలో తాజా విక్రయాలు జరిగేలా చూడాలని, ఏమైనా లోపాలు ఉంటే యజమానులకు జరిమానాలు విధించి లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు తాగునీటిని క్లోరేషన్ చేయాలని, పైప్‌లైన్‌లో లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. గ్రామపారిశుధ్య కమిటీలను చైతన్యపరిచే వారిచే సమావేశాలు నిర్వహించి గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించేలా చూడాలి. అలాగే పటిష్టంగా పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా నాటిన మొక్కలను సంరక్షించాలని, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మరల మొక్కలను నాటాలని పేర్కొన్నారు. పంచాయతీ ద్వారా అందే పౌరసేవలను సకాలంలో అందించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజులను వచ్చేనెల 15వ తేదీ వరకు వసూలు చేయాలని, విద్యుత్ సమస్యలు ఉంటే ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు.
ఫ పంచాయతీలను వేధిస్తున్న నిధుల కొరత..
గ్రామపంచాయతీలకు సకాలంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహించక పోవడంతో నిధుల కొరతతో సతమతం అవుతున్నాయి. 2024 జనవరి 31 తేదీన పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. 20మాసాలు గడుస్తున్నా కూడా ఎన్నికల నిర్వహించక పోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకపోవడంతో నిధుల కొరత పంచాయతీలను వెంటాడుతున్నది. ఈ క్రమంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహణకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.