పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:51 PM
నగర పరిశుభ్రతపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం ఇళ్లు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్‌లోని చెత్తను బుట్టల్లో వేసి స్వచ్ఛ ఆటోలు, రిక్షాల్లో మాత్రమే వేయాలి. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాలనేది నగరపాలక సంస్థ ఉద్దేశం. చెత్తను రోడ్లు, డ్రైనేజీలు, పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే జరిమానా విధిస్తామని, చెత్తరహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ప్రజలకు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నగర పరిశుభ్రతపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం ఇళ్లు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్‌లోని చెత్తను బుట్టల్లో వేసి స్వచ్ఛ ఆటోలు, రిక్షాల్లో మాత్రమే వేయాలి. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాలనేది నగరపాలక సంస్థ ఉద్దేశం. చెత్తను రోడ్లు, డ్రైనేజీలు, పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే జరిమానా విధిస్తామని, చెత్తరహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ ప్రజలకు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, దుకాణాల నుంచి చెత్త సేకరణతోపాటు చెత్తసమీకరణ ప్రాంతాల్లో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరుబయట చెత్తను వేస్తే సీసీ కెమెరాల్లో గుర్తించి చెత్తవేసిన సదరు వ్యక్తికి జరిమానా విధిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే దుకాణాలు, చికెన్‌సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్‌లు, బేకరీలు, బార్లను తనిఖీ చేస్తూ చట్టపరంగా జరిమానా విధిస్తున్నారు. పారిశుధ్య విభాగం అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పారిశుధ్య అధికారులు, సిబ్బంది జిల్లా జైలు గోడను ఆనుకొని ఉన్న పండ్ల దుకాణాలు, చికెన్ సెంటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. చికెన్ సెంటర్ యజమానికి 20 వేల జరిమానా విధించారు. అపరిశుభ్రంగా ఉన్న ఐదు పండ్ల దుకాణాల నిర్వహకుల నుంచి మూడు వేల జరిమానా వసూలు చేశారు. నగరంలోని దుకాణాలతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దుకాణాల్లో చెత్త వేసేందుకు చెత్తబుట్టను వినియోగించి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని ఆదేశించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తే జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. చెత్తరహిత నగరంగా, ఆరోగ్య నగరంగా మార్చుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి నగరపాలక సంస్థకు సహకరించాలని సూచించారు.