అంగన్‌వాడీల్లో పిల్లల పోషణపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:19 AM
పిల్లల పోషణ, ఆరోగ్యంపై అంగన్‌వాడీల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.
తిమ్మాపూర్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పిల్లల పోషణ, ఆరోగ్యంపై అంగన్‌వాడీల్లో ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో పోషణ ఆరోగ్య దినం సందర్భంగా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు. ప్రీ స్కూల్ పిల్లలతో కలెక్టర్ కొద్దిసేపు ముచ్చటించారు. ప్రీస్కూల్ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అంగన్వాడి సేవలను బాలింతలు, గర్భిణులు వినియోగించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న శుక్రవారం సభలో మహిళలకు అందజేస్తున్న సేవలను తెలుసుకోవాలన్నారు. సిలబస్ ప్రకారం ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్వాడీ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
ప్రాఽథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం
నుస్తులాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్బంగా తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను బెంచీలపై, మ్యాట్లపై కూర్చోబెట్టాలని సూచించారు. సిలబస్ ప్రకారం విద్యార్ధులకు భోధించాలని, తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేయాలన్నారు. బుధవారం బోధనను విధిగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్ధార్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీపీవో శ్రీమతి, ఎంఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.