Share News

జిల్లా కేంద్రంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

ABN , Publish Date - May 21 , 2025 | 01:20 AM

జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పక్కన ఎన్‌పీడీసీఎల్‌ 1.4 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

జిల్లా కేంద్రంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పక్కన ఎన్‌పీడీసీఎల్‌ 1.4 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆసమ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకోనున్నది. ఈ సంస్థ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను నెలకొల్పడంతోపాటు 25 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతను తీసుకుంటుంది. ఇదే సామర్థ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కూడా ఎన్‌పీడీసీఎల్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా 22 లక్షల యూనిట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి కానున్నది.

ఫ హౌసింగ్‌ బోర్డు సబ్‌స్టేషన్‌ పక్కన

హౌసింగ్‌బోర్డు సబ్‌ స్టేషన్‌ పక్కన ఎన్‌పీడీసీఎల్‌కు ఉన్న 5 ఎకరాల 15 గుంటల ఖాళీ స్థలంలో ఈ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే భూమిని చదును చేయడంతోపాటు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. ఈ పవర్‌ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత జిల్లా కేంద్రంలో ఎలాంటి పవర్‌ కొరత, అంతరాయాలు జరిగే అవకాశం ఉండదు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పుడు సోలార్‌ పవర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పట్టణవాసులకు నిరంతర విద్యుత్‌ అందే అవకాశం ఉన్నది. 22 లక్షల యూనిట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి కానున్న నేపథ్యంలో ఆ మేరకు విద్యుత్‌ కొనుగోలు తగ్గనున్నది. ఎన్‌పీడీసీఎల్‌ ఈ మేరకు ఆసమ్‌ సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తున్నది.

Updated Date - May 21 , 2025 | 01:20 AM