Share News

చేనేత బతుకుల్లో చిరునవ్వులు..

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:56 AM

చేనేత మగ్గం సడుగులు విరగడంతో వృద్ధులకే పరిమితమై పోయింది.

చేనేత బతుకుల్లో చిరునవ్వులు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

చేనేత మగ్గం సడుగులు విరగడంతో వృద్ధులకే పరిమితమై పోయింది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యువకులు మరమగ్గాల వైపు అడుగులు వేసినా కొందరు యువకులు చేనేత మగ్గంపై ప్రయోగాలు చేస్తున్నారు. అగ్గిపెట్టెలో అమిరే చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలు, పట్టు వస్త్రాలను నేస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రంగుల రంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళలాడిన చేనేత మగ్గాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చేనేత కార్మికులు మరమగ్గాలపైనే ఆధారపడుతున్నారు. మిగిలిన కొద్ది మంది కార్మికులు చేనేత మగ్గాన్ని నమ్ముకున్నా సరైన కూలీ లేక ఉపాధి కరువై కాలం వెల్లదీస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త పథకాలను తీసుకవస్తోంది. అభయహస్తంలో పొదుపు నిధి, బీమా, భరోసా పథకాలను ఒక గూటికి తీసుకురాగా, తాజాగా చేనేత కార్మికుల కోసం నేతన్నకు భరోసా పథకాన్ని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో చేనేత వస్త్రాలను నాణ్యతతో తయారుచేయించడంతో పాటు ప్రత్యేక లోగోను ముద్రించి కార్మికులకు చేతినిండా ఉపాధిని అందించే దిశగా నేతన్న భరోసా పథకం నిలవనుంది. చేనేత అభయ హస్తంలో భాగంగా నేతన్నకు భరోసా పథకం మార్గదర్శకాలను విడుదల చేశారు. తెలంగాణ హైండ్లూమ్‌, టెక్స్‌టైల్‌, తెలంగాణ అథైటిక్‌ వీవ్స్‌ పేరిట ప్రత్యేక లోగోలు, క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించనున్నారు. దీని ద్వారా చేనేత వస్త్రాలను ప్రత్యేకంగా గుర్తించే వీలు ఉంటుంది. నేతన్న భరోసా పథకంలో కార్మికులకు సంవత్సరానికి గరిష్టంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహం కింద రూ.6 వేలు అందించనున్నారు. మరమగ్గాల వైపు ఉన్న సిరిసిల్ల కార్మికులు చేనేత మగ్గాల వైపు మళ్లించడానికి చర్యలు చేపట్టారు. చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులు ఫ్రీలూం, పనులుగా ఉన్న అద్దకం, టైయింగ్‌, డిజైనింగ్‌, వార్ఫింగ్‌, వైండింగ్‌, సైజింగ్‌ తదితర అనుబంధ పరిశ్రమల్లో పనిచేసేవారు, తమ వార్షిక ఆదాయంలో చేనేత వృత్తిద్వారా కనీసం 50 శాతం పొందుతున్నవారు, వార్పుల నిర్దేశిత లక్ష్యంతో 50 శాతం కంటే ఎక్కువగా పూర్తి చేసిన నేత కార్మికులకు వేతన ప్రోత్సాహం కింద ఏడాదికి రెండుసార్లు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌, అక్టోబరు నుంచి మార్చి వరకు రూ.9 వేలు, అనుబంధ కార్మికులకు రూ.3 వేలు జమ చేస్తారు. మొదటి విడతలో 50 శాతం పని పూర్తిచేయని కార్మికులకు రెండో విడతలో ప్రోత్సాహం చెల్లిస్తారు. 18 సంవత్సరాలు నిండిన కార్మికుల నుంచి జియోట్యాగింగ్‌ చేసిన చేనేత మగ్గాలపై పనిచేసే వారికి నేతన్నకు భరోసా పథకం వర్తించనుంది.

జిల్లాలో రికార్డుల ప్రకారం 13 సొసైటీలు ఉండగా, ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 35 వేల మరమగ్గాలపై బట్ట ఉత్పత్తి జరుగుతుంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా, ఇప్పడు 204 మగ్గాలకు చేరుకున్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత మిత్ర పథకాలను అందిస్తున్నారు. నూలు సబ్సిడీని ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 384 మంది కార్మికులకు రూ.4.21 లక్షలు విడుదల చేశారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేశారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2,662 మంది పథకంలో చేరారు. చేనేత లక్ష్మి పథకంలో చేరిన ఉద్యోగులు బట్టలు కొనుగోలు చేశారు. ఈ పథకం మళ్లీ కొనసాగలేదు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్‌ కింద రూ.1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రంలో ఆధునిక డిజైన్లతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మొదటి విడతలో రూ.19.10 లక్షలు విడుదల చేయగా, 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో ప్రతి సంవత్సరం రూ.1.50 కోట్ల చేనేత వస్త్రాలు ఉత్పత్తి జరుగుతున్నాయి. జిల్లాలో 175 చేనేత మగ్గాలు ఉండగా, అందులో కొన్ని వినియోగంలో లేవు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేశారు. జిల్లాలో సిరిసిల్లలో 76 మగ్గాలు, వేములవాడలో 4, వేములవాడ మండలంలో 7, చందుర్తిలో 8, బోయినపల్లిలో 27, తంగళ్లపల్లిలో 34, ఇల్లంతకుంటలో 4, గంభీరావుపేటలో 1, కోనరావుపేటలో 14 ఉన్నాయి. వీటికి సంబంధించిన చేనేత కార్మికులు నేతన్నకు భరోసాతో లబ్ధి పొందనున్నారు.

అభయ హస్తం ఆశలు..

ఆకలితో పేగులు మాడిపోతున్నా పోగుపోగును అతుకుతారు... అడుగడునా చిక్కుపడ్డ ఎదురు పోగులను వేరు చేస్తూ మగ్గంపైన పొద్దస్తమానం పేక చెక్కలు తొక్కి, తొక్కి, కండెలు, బింగిరీలు చుట్టి రాట్నపు గిరకల మధ్య చేతుల స్పర్శలు కోల్పోతాయి... చేనేత మగ్గం, మరమగ్గం అయినపుడు కార్మికుల కళ్లలో ఆశలు మొదలయ్యాయి. ప్రభుత్వం చేనేత, మరమగ్గాల కార్మికులకు మూడు పథకాలు అందించడానికి ఒకే గొడుగు కిందికి తీసుకవచ్చే చర్యలు చేపట్టింది. అభయ హస్తం పేరుతో పొదుపు నిధి, బీమా భరోసా, చేనేత భరోసా, పథకాలను అందించే దిశగా చర్యలు చేపట్టి పథకాలను చేరువ చేస్తోంది. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు బతుకమ్మ చీరలస్థానంలో స్వశక్తి మహిళలకు అందించే చీరల ఆర్డర్లు, సర్వశిక్ష అభియాన్‌ వంటి ఆర్డర్లను అందించిన క్రమంలోనే నేతన్న పొదుపు నిధి, నేతన్న బీమా, నేతన్న భరోసా పథకాలను ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చింది. నేతన్నకు అభయ హస్తం పేరుతో పథకాలను ముందుకు తీసుకరావడం, చేనేత భరోసా మార్గదర్శకాలు ప్రకటించడంపై కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. నేత కార్మికుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని భావిస్తున్నారు. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 10 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రకటన చేయడంతో పాటు జీవోను జారీ చేశారు. ప్రాథమికంగా మూడు పథకాలకు సంబంధించి రూ.168 కోట్లు విడుదల చేశారు. నేతన్నకు అభయహస్తంలో భాగంగా మూడు పథకాలు ఒకే గొడుగు కిందికి చేర్చడంతో పాటు చేనేత కార్మికులు పొదుపు నిధికి అవకాశం కల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30,352 మరమగ్గాలు, చేనేత మగ్గాలు 175 ఉన్నాయి. వీటిపై పనిచేసే కార్మికులను పొదుపు నిధిలో చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైండ్లూమ్స్‌ వీవర్స్‌ త్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీం(చేనేత చేయూత) పథకంగా అమలు చేసింది. ఈ పథకంలో 18 ఏళ్లు వయస్సు పైబడి కనీసం 50 శాతం చేనేత వృత్తినుంచి ఆదాయం పొందుతున్న వారు ప్రతి నెలా 8 శాతాన్ని ఆర్డీ 1 ఖాతాల్లో జమచేసుకుంటే, అంతే మొత్తంలో ప్రభుత్వం ఆర్డీ 2 ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే మరమగ్గాల కార్మికులకు ఈ పథకం అమల్లో ఉంది.

‘నేతన్న బీమా’ వయస్సు సడలింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్న బీమా పథకం కుటుంబాలకు ఆసరాగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 18 నుంచి 59 ఏళ్లలోపు చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని అందించారు. ప్రమాదవశాత్తు, సహజ మరణమైనా కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందే విధంగా ఏర్పాటు చేశారు. ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే ఉచితంగా చెల్లిస్తుంది. చాలామంది 59 ఏళ్లు పైబడిన వారు కూడా చేనేత మరమగ్గాలపై పనిచేయడం వల్ల బీమా సౌకర్యాన్ని అందుకోలేకపోయారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న అభయహస్తంలో వయస్సు సడలింపును అందించారు. 18 సంవత్సరాలు నిండి వస్త్రోత్పత్తి రంగంలో పనిచేసిన వారు అర్హులుగా కటాఫ్‌ వయస్సు అంటూ లేకుండా ప్రకటించారు. దీంతో సిరిసిల్లలోని మరమగ్గాలు చేనేత కార్మికులకు ఎంతో ఊరట కలగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,720 మంది కార్మికులు బీమా పథకంలో ఉన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:56 AM