siricilla : అంచనా తప్పింది..
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:49 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఎట్టకేలకు ముగిశాయి. ప్రకృతి వైపరీత్యాలు, కొనుగోళ్లలో జాప్యం వంటి సమస్యలు అధిగమించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42,097 మంది రైతుల నుంచి రూ.623.98 కోట్ల విలువైన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది.
- జిల్లాలో తగ్గిన పౌరసరఫరాల సేకరణ లక్ష్యం
- రూ.623.98 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
- యాసంగిలో లక్ష్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు
- 42097 మంది రైతుల నుంచి 2.68 మెట్రిక్ టన్ను సేకరణ
- జిల్లాలో 241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
- ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాల రికార్డు
- నేడు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఎట్టకేలకు ముగిశాయి. ప్రకృతి వైపరీత్యాలు, కొనుగోళ్లలో జాప్యం వంటి సమస్యలు అధిగమించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42,097 మంది రైతుల నుంచి రూ.623.98 కోట్ల విలువైన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. యాసంగిలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జిల్లాలో యాసంగిలో 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి సాగుకు అనుగుణంగా దిగుబడిపై పౌర సరఫరాల శాఖ కొనుగోలుకు కార్యాచరణ రూపొందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1.78 లక్షల ఎకరాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దొడ్డురకం 2.92 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 8 వేల మెట్రిక్ టన్నులు ధ్యానం వస్తుందని అంచనా వేశారు. సన్నరకం కొనుగోలు లక్ష్యం మేరకు పూర్తిచేశారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళ సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచారు. మహిళలు కేంద్రాలను సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు తెలుపడానికి సభ ఏర్పాటు చేశారు.
242 కొనుగోలు కేంద్రాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా 242 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. ఇందులో ఐకేపీ ద్వారా 190 కేంద్రాలు, సింగిల్‌విండోల ద్వారా 44, డీసీఎంఎస్ ద్వారా ఒకటి, మెప్మా ద్వారా 7 కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 42,097 మంది రైతుల నుంచి 2 లక్షల 68 వేల 955మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 32,556 మంది రైతుల నుంచి 2023.460 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 8274 మంది రైతుల నుంచి 57636.980 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 436 మంది రైతుల నుంచి 3270.800 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 831 మంది రైతుల నుంచి 5706.820 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో దొడ్డు రకం 260192.970 మెట్రిక్ టన్నులు, సన్నరకం 8762.090 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. వడగళ్ల వర్షాలు, సాగనీటి కొరత వంటి సమస్యలతో దిగుబడిపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.
రూ.543.86 కోట్లు చెల్లింపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో రూ.623.98 కోట్ల విలువైన ధాన్యాన్ని 42097 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.543.86 కోట్లు చెల్లించారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన 3287 మంది రైతులకు రూ.415.43కోట్లు చెల్లించగా, సింగిల్ విండోల ద్వారా 8175 మంది రైతులకు రూ.109.97 కోట్లు, డీసీఎంఎస్ ద్వారా 436 మంది రైతులకు రూ.6.28 కోట్లు, మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 813 మంది రైతులకు రూ.12.18 కోట్లు ధాన్యం డబ్బులను చెల్లించారు. ప్రస్తుతం రూ.80.12 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది.
మహిళా శక్తి చాటారు..
ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఐకేపీ కింద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధిక శాతం మంజూరుచేసింది. ఇందులో భాగంగా జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 190 కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కేటాయించారు. అకాల వర్షాలు, వాతావరణ కారణాలతో రైతుల ధాన్యం ఉత్పత్తులు పాడవకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ మొదటి వారంలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రూ.625కోట్ల విలువైన ధాన్యం సేకరించారు. ఇందులో మహిళా సంఘాల ద్వారా 32,087 మంది రైతుల నుంచి రూ.470 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సేకరించిన ధాన్యం ఒక క్వింటాలుకు రూ.32 కమిషన్‌గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలోని మహిళా సంఘాలకు దాదాపు రూ.6 కోట్ల కమిషన్ రానున్నది.