siricilla : వానాకాలం రేషన్ రెడీ
ABN , Publish Date - May 26 , 2025 | 12:30 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) వర్షాకాలంలో సబ్సిడీ బియ్యం రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మారుమూల గ్రామాలకు బియ్యం చేరవేసే క్రమంలో బియ్యం తడిసిపోవడం, వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- మూడు నెలల బియ్యం కోటా పంపిణీకి నిర్ణయం
- కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి సన్నబియ్యం తిప్పలు
- జిల్లాలో రేషన్ లబ్ధిదారులు 5.35 లక్షల మంది
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వర్షాకాలంలో సబ్సిడీ బియ్యం రవాణాకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మారుమూల గ్రామాలకు బియ్యం చేరవేసే క్రమంలో బియ్యం తడిసిపోవడం, వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ బియ్యం జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇవ్వాలని అదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు రేషన్ దుకాణం చుట్టూ తిరగకుండా మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి తీసుకునే వీలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ మాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మొదట్లో కొంత ఇబ్బంది ఏర్పడినా సన్నబియ్యం బాగానే ఉన్నాయనే ప్రచారం జరిగింది. సన్నబియ్యం రావడంతో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర కూడా పడిపోయింది. రేషన్ బియ్యం అమ్మకాలు కూడా లేకుండా అక్రమాలకు చెక్ పడింది. ఇదంతా బాగానే ఉన్నా కేంద్ర ప్రభుత్వం మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించడంతో మూడు నెలల సన్నబియ్యం సమకూర్చడంపై చర్చ జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్నబియ్యం పంపిణీతో 95 శాతానికి పైగానే రేషన్ బియ్యం తీసుకోవడం గమనార్హం. మూడు నెలల కోటా బియ్యం కూడా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా తమ ఆర్థిక సమస్యలను అర్థం చేసుకొని అడ్వాన్స్‌గా కమీషన్ కూడా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.
జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం కోటా 98.59 లక్షల కిలోలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన సన్నరకం బియ్యం 98.59 లక్షల కిలోలు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన రేషన్ కోటా అలాట్‌మెంట్ కూడా జరిగింది. రేషన్ బియ్యం ఒకేసారి రానున్న క్రమంలో డీలర్లు కూడా కోటా విడుదలకు సంబంధించి నిల్వ చేసేందుకు గోదాములు లేకపోవడంతో ప్రధాన గోదాము నుంచి అవసరం మేరకు బియ్యం పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 345 రేషన్ దుకాణాలు ఉండగా, 1,77,851 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 13,748, ఆహార భద్రత కార్డులు 1,63,900, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులు 5,35,920 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ లబ్ధిదారులు 37,389 మంది, ఆహార భద్రత లబ్ధిదారులు 4,98,324 మంది, అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు 207 మంది ఉన్నారు.
మూడు నెలల రేషన్ కోటా ఇలా...
మండలం లబ్ధిదారులు బియ్యం (కిలోల్లో)
బోయినపల్లి 35,224 6,35,698
చందుర్తి 32,671 5,75,444
గంభీరావుపేట 44,049 7,96,665
ఇల్లంతకుంట 45,684 8,10,801
కోనరావుపేట 43,077 7,61,987
ముస్తాబాద్ 45,382 8,21,029
రుద్రంగి 16,155 2,89,183
సిరిసిల్ల 85,726 17,60,795
తంగళ్లపల్లి 42,401 8,11,116
వీర్నపల్లి 14,055 2,55,335
వేములవాడ 60,249 10,64,136
వేములవాడ రూరల్ 22,483 3,97,365
ఎల్లారెడ్డిపేట 48,764 8,80,232
-----------------------------------------------------------------------------------------
మొత్తం 5,35,920 98,59,786
-----------------------------------------------------------------------------------------