siricilla : సుస్థిర సాగు విధానానికి శ్రీకారం..
ABN , Publish Date - May 05 , 2025 | 12:23 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) రైతులను నష్టాల నుంచి గట్టేక్కించేలా సుస్థిర వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచడంతో పాటు శాస్త్రీయత వైపు చైతన్యవంతం చేసే దిశగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- నేటి నుంచి జూన్ 13 వరకు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
- వానాకాలం సీజన్‌పై సలహాలు, సూచనలు
- జిల్లాలో 46 గ్రామాల్లో అవగాహన సదస్సులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
రైతులను నష్టాల నుంచి గట్టేక్కించేలా సుస్థిర వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచడంతో పాటు శాస్త్రీయత వైపు చైతన్యవంతం చేసే దిశగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 46 గ్రామాల్లో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించనున్నారు. శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, ఎంఈవోలు, రైతుల వద్దకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తక్కువ పెట్టుబడితో దిగుబడులు ఎక్కువగా సాధించే పద్ధతులపై శాస్త్రీయ సూచనలు అందిస్తారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ పరిస్థితులు, నీటి కొరత, భూమిలోని సారం తగ్గడం వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపనున్నారు.
ఫ వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి..
జిల్లాలో వానాకాలం సీజన్‌లో వేసే వరి, పత్తి, ఇతర పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించనున్నారు. ఉద్యానవన పంటలు, కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.40 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేయనున్నారు. వరి 1.80 లక్షల ఎకరాల వరకు వరి, 50 వేల ఎకరాల వరకు పత్తి ప్రధానంగా సాగు చేయనున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుతారు. సాంకేతికత ఆధారంగా రైతుల అభివృద్ధికి రైతుల ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు. గ్రామాల్లో నాణ్యమైన విత్తనాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరికి శాస్త్రీయంగా శిక్షణ కూడా అందించనున్నారు. విత్తన ఎంపికలపై అవగాహన కల్పించనున్నారు.
ఫ జిల్లాలో 46 గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు..
రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నేపధ్యంలో ఈనెల 5 నుంచి జూన్ 13వ తేది వరకు జిల్లాలో రైతు వేదికలు, గ్రామపంచాయతీల వద్ద రైతులతో సమావేశాలను నిర్వహిస్తారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా, 46 గ్రామాలను ఎంపిక చేశారు. అందులో వేములవాడ రూరల్ మండలంలో వట్టెంల, హాన్మాజిపేట, చెక్కపల్లి, మర్రిపల్లి, బోయినపల్లి మండలంలో బోయినపల్లి, విలాసాగర్, మాన్వాడ, తడగొండ, ఇల్లంతకుంట మండలంలో పొత్తూర్, గాలిపల్లి, రేపాక, పెద్దలింగాపూర్, ముస్కానిపేట, వల్లంపట్ల, రుద్రంగి మండలంలో రుద్రంగి, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చంద్రంపేట, చిన్నబోనాల, చందుర్తి మండలంలో మర్రిగడ్డ, సనుగుల చందుర్తి, మూడపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్, బొప్పాపూర్, గొల్లపల్లె, కోనరావుపేట మండలం నిజామాబాద్, కోనరావుపేట, మామిడిపల్లి, సుద్దాల, గంభీరావుపేట మండలంలో మల్లారెడ్డిపేట, లింగన్నపేట, గంభీరావుపేట, నర్మాల, గోరంటాల, తంగళ్లపల్లి మండలంలో తంగళ్లపల్లి, తాడూర్, కస్బెకట్కూర్, దేశాయిపల్లి, బద్దెనపల్లి, జిల్ల్లెల్ల, ముస్తాబాద్ మండలంలో చీకోడు, ముస్తాబాద్, ఆవునూర్, మద్దికుంట, మొర్రాయిపల్లె, వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, వేములవాడ మండలంలో మారుపాక గ్రామాల్లో శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సుస్థిర ఆదాయాన్ని పొందేలా, పర్యావరణం కాపాడే దిశగా అవగాహన కల్పించనున్నారు.