siricilla : అప్పు పుట్టట్లే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:15 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ‘‘సిరిసిల్ల చెందిన ఒక వ్యక్తి బిజినెస్‌లో పెట్టుబడుల ఆశలు చూపి అధిక వడ్డీ ఇస్తామని హడావుడి చేశాడు.
- చేబదుళ్లు కూడా లేవు..
- మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక కష్టాలు
- వడ్డీ ఆశలతో మోసపోతున్న వ్యాపారులు, చిరుఉద్యోగులు
- అప్పులు తీసుకున్న వారి నుంచే బెదిరింపులు
- మరోవైపు వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లు
- గత సంవత్సరం 54 ఫైనాన్స్ కేసులు..ఈనెలలోనే 10 కేసులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
‘‘సిరిసిల్ల చెందిన ఒక వ్యక్తి బిజినెస్‌లో పెట్టుబడుల ఆశలు చూపి అధిక వడ్డీ ఇస్తామని హడావుడి చేశాడు. సిరిసిల్లతోపాటు సిద్దిపేట, హైదరాబాద్ వంటి నగరాల్లో చిన్నచిన్న బిజినెస్‌లు చూపి కోట్ల రూపాయల్లో అప్పులు చేశాడు. బ్యాంకుల కంటే మూడింతల వడ్డీ వస్తుందని ఆశతో అనేక మంది డబ్బులు ఇచ్చారు. కానీ వ్యాపారి కొద్దిరోజులకే పరారయ్యాడు.’’
‘‘సిరిసిల్లలో మరికొందరు వ్యాపారులు వడ్డీలకు అప్పులు తీసుకొని కోట్ల రూపాయలకు ఐపీలు పెట్టి దర్జాగా తిరుగుతున్నారు.’’
చిరుఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు, దుకాణాలు గుమస్తాలు, మరమగ్గాల అసాములు రూపాయి రూపాయి కూడబెట్టుకుని తెలిసిన వ్యాపారులే కదా అని వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు మోసపోతున్నారు. వడ్డీ రాకపోగా అసలు కూడా కోల్పోయి లబోదిబోమంటున్నారు. మరోవైపు వడ్డీలకు ఇవ్వడం చట్టబద్ధత లేకపోవడంతో పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని అప్పులు తీసుకున్న కొందరు డబ్బులు ఇచ్చిన వారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో డబ్బు కోసం నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా అప్పు ఇచ్చిన వారిపైనే కేసులు పెడుతున్న సందర్భంలో ఇచ్చిన డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కేసులు, డబ్బులు ఇచ్చినవారు తిరిగి ఇవ్వని పరిస్థితులు పెరిగిపోతున్న క్రమంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవసరాలకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సాధారణ కుటుంబాల్లో చిన్నచిన్న అవసరాలకు అప్పుపుట్టని పరిస్థితుల్లో ఉన్నాయి. కనిసం చేబదుళ్లు కూడా ఇవ్వడం లేదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి ఇబ్బందిగా మారింది. డబ్బులు సర్దుబాటు కానీ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. అప్పులు ఇచ్చిపుచ్చుకునే సమయంలో మధ్యవర్తులుగా ఉన్నవారు సైతం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్నేహితులు, బంధువుల మధ్య విభేదాలకు దారి తీస్తున్నాయి. నిజాయితీగా అప్పు తీసుకొని డబ్బులు చెల్లించేవారికి అప్పుపుట్టక ఇబ్బంది పడుతున్నారు.
బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలువురు వ్యాపారులు మోసాలు చేసి ఐపీ పెట్టడం, ఊరు వదిలి పారిపోవడం వంటి సంఘటనలతో ఆర్థికంగా ఉన్నవారు అప్పులు ఇవ్వడం మానేశారు. వడ్డీ తక్కువ వచ్చిన బ్యాంకులు డిపాజిట్లు చేస్తున్నారు. స్థిరాస్తులపై దృష్టి పెడుతున్నారు. సిరిసిల్లలో సహకార బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ కూడా ఎక్కువగానే ఇస్తుండడంతో వ్యాపారులు డిపాజిట్లు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఏదైనా ఆర్థిక అవసరం పడితే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గతంలో ఎవరికైనా పైసలు అవసరం ఉంటే ఎవరో ఒకరు సర్దుబాటు చేసేవారు. మిత్రులు, బంధువులు అప్పు ఇచ్చి అదుకే అవసరం తీరగానే చెల్లించే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు పొందడానికి శ్రమించాల్సిన పరిస్థితి ఉంది, పలువురు వడ్డీల పేరుతో కోట్లలో అప్పులు తీసుకొని చేస్తున్న మోసాలతో బ్యాంకులకు నమ్ముకుంటున్నారు.
అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా ఫైనాన్స్, చిట్టీల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పులు ఇస్తున్నారు. కనీస అనుమతి లేనివారు గుట్టు చప్పుడు కాకుండా ఫైనాన్స్ దందాలు కొనసాగిస్తున్నారు. వడ్డీ మీద వడ్డీ వేసి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చితికిపోతున్న బతుకులు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో గల్లీగల్లీలో వడ్డీరాయుళ్లు మధ్య తరగతి కుటుంబాల అవసరాలను ఆసరా చేసుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అప్పుల బాధను తట్టుకోలేక సిరిసిల్లలో నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. గ్రామాల్లో ఆశించిన దిగుబడులు రాక అప్పులు తీర్చే మార్గం లేక ప్రాణాలు వదిలిన అన్నదాతలు ఉన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ దందా కొనసాగుతున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నట్లుగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. వడ్డీరాయుళ్ల ఇష్టారాజ్యంగా మారుతున్న పట్టించుకునే వారే లేరనే విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వడ్దీ దందా అనేక కుటుంబాలను రోడ్డున పడేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడలో ఫైనాన్స్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. సామాన్యుల అవసరాలను అవకాశంగా తీసుకొని వీక్లీ ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్, నెలవారీ ఫైనాన్స్‌లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇళ్ల మార్టిగేజ్, బంగారం తాకట్టుతో కూడా అప్పులు ఇస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోట్ల రూపాయల్లో దందాలు జరుగుతున్నాయి. జిల్లాలో కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సబ్ధత నెలకొనడంతోనే రియల్ వ్యాపారులు ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులుగా మారుతున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ దందాలో అవసరాన్ని బట్టి అదాయాన్ని సర్దుబాటు చేసే వీలు ఉండడంతో వడ్డీ వ్యాపారాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. వడ్డీ వ్యాపారులు సాధారణంగా కొందరు రూ 2 నుంచి 3వరకు వసూలు చేస్తుండగా కొంతమంది 5 శాతం వసూలు చేస్తున్న వారు ఉన్నారు.
నామామాత్రంగా కేసులు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సామాన్యుల ఆర్థిక అవసరాలను పెట్టుబడిగా దందా చేస్తున్న వారిపై పోలీస్ యంత్రాంగం నామామాత్రంగానే నిఘా పెడుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వడ్డీ వ్యాపారులపై నామామాత్రంగా దాడులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2024 సంవత్సరం జిల్లాలో 54 కేసులు నమోదు చేశారు. 18 కేసుల్లో రూ 17 లక్షల 34 వేల జరిమానాలు పడ్డాయి. ఈ సంవత్సరంలో 12 కేసులు నమోదు చేశారు. ఈ నెలలో 20 బృందలతో జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు చేసి 10 మంది పైన కేసులు నమోదు చేశారు. రూ 60 లక్షల విలువైన వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత మంది పోలీసుల దాడులకు భయపడి నామామాత్రంగా ఛిట్ ఫండ్ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషను చేసుకొని ఆ పేరుతో ఫైనాన్స్ దందాలు నడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.