Share News

నేతన్నలకు ’సిరి’ నవ్వులు

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:20 AM

కష్టాలు.. సుఖాలు.. విషాదాలు నిత్యం వెంటాడే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో ఈ సంవత్సరం నేతన్నల్లో ‘సిరి’ నవ్వులు పూయించింది.

నేతన్నలకు ’సిరి’ నవ్వులు

- స్వశక్తి చీరలతో చేతినిండా పని

- 4.30 కోట్ల మీటర్ల చీర బట్ట ఉత్పత్తి ఆర్డర్లు పూర్తి

- అదనంగా 1.87 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్‌

- రూ 58 కోట్ల చెల్లింపు

- ఆపెరల్‌ పార్కుకు అంతర్జాతీయ పరిశ్రమలు

- తీరని ఆశగానే పవరూలూమ్‌ జోన

- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ-కాలచక్రం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కష్టాలు.. సుఖాలు.. విషాదాలు నిత్యం వెంటాడే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో ఈ సంవత్సరం నేతన్నల్లో ‘సిరి’ నవ్వులు పూయించింది. గత సంవత్సరం ప్రభుత్వ ఆర్డర్‌ లేక పస్తులు, ఆత్మహత్యలు, ఆందోళనలతో కలవరపడ్డారు. 2025 సంవత్సరం ప్రారంభంలోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో కార్మికులకు చేతినిండా పనితో ఊరట లభించింది. స్వశక్తి ఉత్పత్తి ఆర్డర్లు రావడంతో కార్మికుల బలవన్మరణాలు ఆగిపోయాయి. చేనేత సొసైటీలకు ఈసారి కూడా ఎన్నికలకు మోక్షం కలగలేదు. కేంద్ర బడ్జెట్లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా పవర్‌లూమ్‌ జోన నిరాశే మిగిల్చింది. వచ్చే సంవత్సరాన్ని కొత్త ఆశలతో నేత కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

మెరిసిన ఇందిరా స్వశక్తి చీరలు..

కొత్త సొబగులతో ఇందిరా మహిళా శక్తి చీరలు ఆడపడుచులకు అందించే ప్రక్రియ ఈ సంవత్సరం సర్కార్‌ మొదలుపెట్టింది. సిరిసిల్ల నేతన్నల చేతిలో మెరిసిన స్వశక్తి చీరలు ఆడపడుచుల చెంతకు చేరి మురిసిపోయాయి. ఇందిరా మహిళా శక్తి పథకంలో మహిళలకు అందిస్తున్న స్వశక్తి చీరలను మొదట స్వశక్తి సంఘాల మహిళలకు మాత్రమే పంపిణీ చేశారు. ప్రభుత్వం తర్వాత 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ చీరలు ఇవ్వాలని భావించడం మహిళల్లో హర్షం వ్యక్తమైంది. ఇందిరా మహిళా శక్తి చీరలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి అర్డర్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం జనవరి, మార్చి నెలలో 4.30 కోట్ల మీటర్ల చీర బట్ట ఉత్పత్తి ఆర్డర్లు రావడంతో మరగ్గాల చప్పుళ్లు మళ్లీ నిరంతరం వినిపిస్తున్నాయి.. సిరిసిల్ల మరమగ్గలపైన చీరల బట్ట ఉత్పత్తి పూర్తి చేయగా మళ్లీ అదనంగా 1.87 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలో దాదాపు 30వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 131 మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌)ల ద్వారా 9,600 మరమగ్గాలపైన ఉత్పత్తి జరుగుతోంది. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు చేతినిండా ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. నాణ్యతలో ఎలాంటి తేడా రాకుండా పలు చర్యలు తీసుకున్నారు. స్వశక్తి మహిళకు డ్రెస్‌ కోడ్‌గా ఉండే విధంగా ఉత్పత్తి చేసిన చీరలను పంపిణీ చేశారు. మహిళలకు అదించిన స్వశక్తి చీరలను సిరిసిల్లలో ఆగస్టులో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆర్డర్లు అందించే ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిజైన్లు పరిశీలించి ఖరారు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు 2017 నుంచి 2023 వరకు ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలుపి వేసింది. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేకపోవడంతో వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది.నేతన్నల ఆత్మహత్యలు, కార్మిక సంఘాల ఆందోళనలు, అనేక విషాధ సంఘటనల మధ్య ప్రభుత్వం మళ్లీ సిరిసిల్ల నేతన్నల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన చీరలను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా చీరల ఉత్పత్తితో సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల పని కల్పించే దిశగా ఆర్డర్లను ఇవ్వడంతో కార్మికులకు నిరంతరంగా ఉపాధి భరోసా వచ్చింది.

అపెరల్‌ పార్కుకు అంతర్జాతీయ పరిశ్రమలు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో బీడిలు చుట్టే కార్మికులు, వస్త్రోత్పత్తి రంగంలో ఉన్న మహిళలకు గార్మెంట్‌ రంగంలో ఉపాధి కల్పించడానికి పూనుకుంది. ఆ దిశగానే సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్‌- పెద్దూర్‌ల వద్ద మహిళల కోసం గార్మెంట్‌ రంగంలో పరిశ్రమలు తీసుకవచ్చే దిశగా అపెరల్‌ పార్కుకు శ్రీకారం చుట్టారు. 2021 ఏప్రిల్‌లో గోకుల్‌దాస్‌ ఇమేజ్‌ గార్మెంట్‌ సంస్థ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో బెంగుళూరుకు చెందిన అంతర్జాతీయ గార్మెంట్‌ రంగ సంస్థ టెక్స్‌పోర్టు కంపెనీ యూనిట్‌ను జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రి పొన్నం ప్రభాక ర్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా రెండువేల మందికి ఉపాధి లభించనుంది. ఇతర గార్మెట్‌ కంపెనీలు కూడా పరిశ్రమల స్థాపనకు దృష్టి పెడుతున్నాయి.

నేతన్నకు బీమాలో వయస్సు సడలింపు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్న బీమా పథకం కుటుంబాలకు ఆసరాగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో 18 నుంచి 59 ఏళ్లలోపు చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని అందించారు. ప్రమాదవశాత్తూ సహజ మరణమైన కార్మికుల కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అందేవిధంగా ఏర్పాటు చేశారు. ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే ఉచితంగా చెల్లించే విధంగా చేసింది. చాలా మంది 59 ఏళ్లు పైబడిన వారు కూడా చేనేత మరమగ్గాలపై పనిచేస్తుండగా వారు బీమా సౌకర్యాన్ని అందుకోలేకపోయారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న అభయహస్తంలో వయస్సు సడలింపును అందించారు. 18 సంవత్సరాలు నిండి వస్త్రోత్పత్తి రంగంలో పనిచేసిన అర్హులుగా కటాఫ్‌ వయస్సు అంటూ లేకుండా ప్రకటించారు. దీంతో సిరిసిల్లలోని మరమగ్గాలు చేనేత కార్మికులకు ఎంతో ఊరట కలగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,600 మంది కార్మికులు బీమా పథకంలో చేరారు. ఈ సంవత్సరం 12 మంది కార్మిక కుటుంబాలకు బీమా సొమ్ము అందించారు.

వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి ఎదురుచూపులు...

సిరిసిల్ల శివారులో నేతన్నలకు ఉపాధికి వారధిగా ఉన్న వీవింగ్‌ పార్కు నేత కార్మికులు, వస్త్రోత్పత్తి దారులకు అశ, నిరాశలుగా మిగిలాయి. అపెరల్‌ పార్కులో యూనిట్లు ప్రారంభం అవుతుండగా కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్‌ టు ఓనర్‌ పథకం కోసం ఈ సంవత్సరం కూడా నిరీక్షణ తప్ప లేదు. గత ప్రభుత్వం చేపట్టిన వర్కర్‌ టు ఓనర్‌ పథకం పై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, నిర్మాణం పూర్తి చేసుకున్న షెడ్లలో ఇతర సంస్థలకు లీజుకు ఇవ్వడంతో పవర్‌లూం కార్మికుల్లో పథకంపై అశలు సన్నగిల్లాయి. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రూ 386.88 కోట్ల పవర్‌లూం కార్మికులను యజమానులుగా మార్చే పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించ డంతో కార్మికుల్లో మళ్లీ అశలు చిగురించాయి. కానీ యాక్షన ప్లాన ఏమిటో కనిపించకపోవడంతో ఎదురుచూపులే మిగిలిస్తున్నాయి.

అద్దకం పరిశ్రమ వెలవెల

సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉండే రంగురంగుల అద్దకం పరిశ్రమ అద్దకం వస్త్రాలతో దక్షిణాది రాష్ట్రాలకు పెట్టీకోట్స్‌ బట్ట అందిస్తున్నా సిరిసిల్ల కాటన అద్దకం పరిశ్రమ రంగులు చెదిరిపోతూ కార్మికులకు ఉపాధిని దూరం చేస్తోంది. తమిళనాడు, గుజరాత రాష్ట్రాల్లోని పరిశ్రమలతో తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తున్నా రంగులు, రసాయనాల ధరలు పెరిగిపోవడంతో అద్దకం కూలీ గిట్టుబాటు కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. బతుకమ్మ చీరలతో పాటు పెటీకోట్స్‌ ఇవ్వాలని అద్దకం పరిశ్రమ యజమాన్యం, కార్మికులు కోరుతున్న ప్రభుత్వం ఆ దిశగా అలోచన చేయకపోవడంతో అనేక పరిశ్రమలు మూత పడ్డాయి.

కలగానే మెగా పవర్‌లూం జోన

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మెగా పవర్‌లూమ్‌ జోనకు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కలేదు. కేంద్ర, రాష్ట్రాలను కుదిపేసిన సిరిసిల్ల నేత కార్మికుల బలవన్మరణాలు, అకలి చావుల నేపఽథ్యంలో కేంద్ర ప్రభుత్వ బృందాలు సిరిసిల్లలో పర్యటించి మెగా పవర్‌లూం క్లస్టర్‌, టెక్స్‌టైల్‌ జోనగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇచ్చారు. నేత కార్మికులను ఆశల్లో ఉంచగా హామీలకే కేంద్రం పరిమితమైంది.

చేనేత సొసైటీల ఎన్నికలకు ఎదురుచూపులు

చేనేత సహకార సంఘాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. చేనేత జౌళి శాఖ రంగాల్లో ఉన్న సోసైటీల ఎన్నికల గడువు ముగిసి అరేళ్లు దాటిపోయినా పర్సన ఇనచార్జ్‌లతోనే సుదీర్ఘంగా కాలం వెల్లదీస్తున్నారు. గత సంవత్సరం జూనలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కాస్తా హాడావుడి చేయడంతో కార్మికులు ఎన్నికలు జరుగుతాయని భావించారు. ఏర్పాట్ల వరకు వెళ్లి ఈ సంవత్సరం గడిచిపోతున్న ఎన్నికల ఊసే మరిచారు.

Updated Date - Dec 30 , 2025 | 01:20 AM