‘స్థానిక’ ఎన్నికలకు సైరన్
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:55 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ జూంబరు 9 జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ఈసీ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ జూంబరు 9 జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు ఈసీ శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషన్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానంతరం ఎన్నికల కమిషన్ శనివారం సాయంత్రం వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నదని తెలుస్తున్నది.
ఫ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఎన్నికల కమిషన్ ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణ అధికారులకు శిక్షణ కూడా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇతరులకు ఏయే స్థానాలు రానున్నాయో జాబితాలను సీల్డ్ కవర్‌లో పంపించాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ మేరకు వాటిని సిద్ధం చేసి పంపించింది.
ఫ ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు
ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదలై ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్నది. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలతోపాటు 170 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో 15 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకుగాను బీసీలకు ఆరు, ఎస్సీ, ఎస్టీలకు మూడు, ఇతరులకు ఆరు స్థానాలు దక్కనున్నాయి. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు ఉండగా 934 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టారు.
ఫ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో చిగురుమామిడి ఎంపీపీ పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇల్లందకుంటలో తొమ్మిది, గంగాధరలో 14, గన్నేరువరంలో 6, హుజూరాబాద్‌లో 12, జమ్మికుంటలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్ రూరల్‌లో 1, కొత్తపల్లిలో ఐదు, మానకొండూర్‌లో 19, రామడుగులో 14, శంకరపట్నంలో 13, తిమ్మాపూర్‌లో 12, వీణవంకలో 14, చొప్పదండిలో 11, సైదాపూర్‌లో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఔత్సాహిక అభ్యర్థులు పోటీకి సన్నద్ధమవుతున్నారు.