సింగరేణిలో పైరవీకారులదే రాజ్యం
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:07 AM
సింగరేణి స్థితిగతులు, ఉత్పత్తి, ఉత్పత్తి వ్యయం, రవాణా, బొగ్గు మార్కెట్‌లో సింగరేణికి ఎదురవుతున్న సవాళ్ళను అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాల్లో చర్చిస్తున్నారు.
గోదావరిఖని, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సింగరేణి స్థితిగతులు, ఉత్పత్తి, ఉత్పత్తి వ్యయం, రవాణా, బొగ్గు మార్కెట్‌లో సింగరేణికి ఎదురవుతున్న సవాళ్ళను అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాల్లో చర్చిస్తున్నారు. యంత్రాల వినియోగం, కార్మికులు పూర్తిస్థాయిలో పని చేయాలని సూచిస్తున్నారు. అయినా కొందరి పనితీరులో మార్పు రావడం లేదు... పైరవీకారులదే రాజ్యంగా నడుస్తోంది. మండల స్థాయి ప్రజా ప్రతినిధి భర్త రెండో షిప్టు వస్తాడు సంతకం పెట్టుకుని వెళ్లి పోతాడు... మైన్ పిట్ సెక్రటరీ మస్టర్ పడి వెళతాడు... లేకుండా ఫోన్‌లోనే మస్టర్ వేసుకుంటాడు... డిప్యూటేషన్ పేర సర్ఫేస్ విభా గాల్లో పని చేస్తూ అండర్ గ్రౌండ్ అలవెన్సుతో వేత నాలు... కొందరికి నిరంతరం ప్లేడేలు... పర్మనెంట్ వర్కర్‌కు ప్లేడేలు దొరకవు... సిక్ లీవులో ఉన్న కార్మికు డికి బెస్ట్ వర్కర్ అవార్డు... సర్ఫేస్ ప్రాంతాల్లో డిప్యూటేషన్ వేయిస్తే రూ.50వేల నుంచి రూ.1లక్ష లంచం... ఇలా సింగరేణిలో పలుకుబడి గల వారి ఇష్టారాజ్యంగా నడుస్తోంది.
సాంకేతిక అభివృద్ధి చెందుతున్న క్రమంలో పటిష్టమైన కార్యనిర్వహణ ఉండాల్సింది పోయి విచ్చల విడితనం పెరిగింది. దుడ్డు ఉన్న వాడిదే రాజ్యం అయ్యింది. కార్మిక సంఘాలు బయట తిట్టుకుంటున్నా బాయిలమీద మాత్రం పనితీరులో వైరుధ్యాలు లేవు. అన్నా తమ్మి అంటూ అంతా కలిసి చేసుకుంటున్నారు. ఇలా సింగరేణిలో రోజూ 500మంది మస్టర్లు పడి వెళ్లిపోతుంటే మరో 500మంది మస్టర్లు పడి పని చేయకుండా గని ఆవరణలో టైంపాస్ చేస్తున్నారు. వీళ్లపై గని అధికారులకు, యాజమాన్యానికి నియంత్రణ లేదు. చర్యలు తీసుకోవడానికి గని స్థాయిల్లో అధికా రులు చేస్తున్న తప్పిదాలను ముందు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఓపెన్‌కాస్టులు, సివిల్ డిపార్ట్‌మెంట్‌లు, ఏరియా ఆసుపత్రులు, ఫారెస్ట్ విభాగం, జీఎం ఆఫీస్ ఇలాంటి సర్ఫేస్ ప్రాంతాల్లో డిప్యూటేషన్ల కోసం కార్మికులు ఎగబడుతున్నారు. ప్రాబల్యం కలిగిన యూనియన్ల నాయకులు వీళ్ల వద్ద ఎంతో కొంత తీసుకుని డిప్యూ టేషన్లు ఇప్పిస్తున్నారు. ఈ డిప్యూటేషన్లు శృతి మించి పోయి వందకు నాలుగువ వంతు డిప్యూటేషన్ల కార్మికులే తయారయ్యారు. ఓపెన్‌కాస్టులో 500మంది మ్యాన్‌అండ్ రోల్‌ఉంటే 100 నుంచి 120మంది డిప్యూటేషన్ల మీద వచ్చినవారే ఉంటున్నారు. పైగా ప్లేడేలు, పీహెచ్‌డీల విషయంలో ఆయా గనిలోని పర్మనెంట్‌గా పని చేస్తున్న కార్మికులంటే డిప్యూటేషన్ల మీద వచ్చిన వారికే ప్లేడేలు, పీహెచ్‌డీలు ఎక్కువగా ఇవ్వడంతో సర్ఫేస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతాల్లో వివాదాలు, గొడవలు పెరిగిపోతున్నాయి. వీటికి తోడు జనరల్ మజ్దూర్ కార్మికులకు షిప్టు వైజ్ డ్యూటీలు ఉండాల్సి ఉంటుంది. ప్రాబల్యం కలిగిన వారు జనరల్ షిప్టు వేయించుకోవడం వివాదాలకు దారి తీస్తున్నది. జనరల్ షిప్టులో పని చేసే వారికి పని తక్కువగా ఉండడంతో పాటు రాత్రి కుటుంబంతో ఉండే అవకాశం ఉంటుంది. దీనితో ఓపెన్‌కాస్టుల్లో జనరల్ షిప్టుల్లో ఉండాల్సిన కార్మికుల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. జనరల్ షిప్టు వేయించినందుకు కూడా అండర్ గ్రౌండ్‌లో, ఓపెన్‌కాస్టుల్లో వేర్వేరు రేట్లు నిర్ణయించబడ్డాయి. ఓ పిట్ సెక్రటరీ 6.30గంటలకే మస్టర్ పడతాడు. తిరిగి వెళ్లిపోయి వాకింగ్‌లు, జాగింగ్‌లు చేసి 9గంటలకు గని మీదకు వస్తాడు. 10.30గంటలకు వెళ్లిపోతూ ఔట్ వేసుకోండి అని చెబుతాడు. ఒక్కో పిట్ సెక్రటరీకి ముగ్గురు నుంచి నలుగురు కార్మికుల వరకు ఈయనకు కేటాయించిన పనులను సరిదిద్దేందుకు నియమించు కుంటున్నారు. రామగుండం రీజియన్‌లోని ఓపెన్ కాస్టులో ఓ కార్మికుడు మూడు నెలల పాటు సిక్ లీవులో ఉన్నాడు. కానీ ఆయన బెస్ట్ వర్కర్‌గా పంద్రా గస్టునాడు ప్రకటించారు. దీనిపై కూడా ఆ గనిలో కార్మికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూ టేషన్లకు వర్క్‌షాప్‌లు, సీఎస్‌పీలకు కూడా విపరీ తమైన డిమాండ్ పెరిగింది. అండర్ గ్రౌండ్‌లో పోస్టింగ్ ఉన్న కార్మికులు కొందరు డిప్యూటేషన్లపై బయట పని చేస్తూ అండర్ గ్రౌండ్ అలవెన్సులు పొందుతున్నారు. దీనిపై యాజమాన్యం ఇటీవల దృష్టి సారించింది. డిప్యూటేషన్లపై సర్ఫేస్‌ల్లో పని చేస్తూ అండర్ గ్రౌండ్ అలవెన్సు పొందుతున్న కొందరు కార్మికులకు పేమెంట్ రికవరీ పెట్టింది. సింగరేణిలో ఉన్న ఓసీపీలు, అండర్ గ్రౌడ్ సుమారు 40 పని ప్రదేశాల్లో అన్నీ కార్మిక సం ఘాలకు చెందిన 90శాతం పిట్ సెక్రటరీలు జనరల్ షిప్టుల్లో ఉండడం గమనార్హం. వీరు ఏ క్యాటగిరి ఉద్యో గులు అయినా జనరల్ షిప్టు వేయించడం పరిపాటిగా మారింది. ఈ పరిణామాలన్నీ సింగరేణి ప్రగతికి ప్రతి బంధకాలుగా మారనున్నాయి. కార్మికుల మధ్య వైషమ్యాలు, ద్వేషాలు పెరుగుతున్నాయి. ఇది సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతపై కూడా ప్రభావం చూపు తున్నది. యాజమాన్యం కింది స్థాయిలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలపై దృష్టి సారించకుంటే సింగ రేణిపై భారీ ప్రభావం పడే ప్రమాదం లేక పోలేదు.