పొదుపు వైపు మళ్లింపు..
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:10 AM
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన పొదుపు సంఘాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం బ్యాంకు లింకేజీల ద్వారా అందిస్తున్న రుణాలు పొంది వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకుంటున్నారు.
- కిశోర బాలికలకు కొత్త పొదుపు సంఘాలు
- 15-18 ఏళ్ల వారితో ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు
- బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చేలా ప్రణాళిక
- వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రూపులు
- జిల్లాలో ఈనెల 30 వరకు స్పెషల్ డ్రైవ్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన పొదుపు సంఘాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం బ్యాంకు లింకేజీల ద్వారా అందిస్తున్న రుణాలు పొంది వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తూ జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం కిశోర బాలికలను సైతం స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు వైపు మళ్లించే దిశగా చైతన్యపరిచే చర్యలు చేపట్టింది. జిల్లాలోని 15 నుంచి 18 సంవత్సరాల వయస్సుగల బాలికలతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసే కసరత్తు ప్రారంభమైంది. జిల్లాలో సెర్ప్ ఆధ్వర్యంలో బాలికలందరికీ సంఘాల్లో సభ్యత్వం కల్పిస్తూ ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 411 మహిళా గ్రామైక్య సంఘాలు ఉండగా, 1.51 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీటికి తోడుగా సెర్ప్ బాలికలతో పాటు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సంఘాలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
ఫ పొదుపు.. సామాజిక చైతన్యం
జిల్లాలోని కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఆర్థికపరమైన భద్రత కల్పించడంతో పాటు చిన్న వయస్సులోనే ఆర్థిక స్థిరత్వం లభించేలా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకు లింకేజీల ద్వారా పొదుపు, ఆర్థిక నిర్వహణ చిన్న వయస్సులోనే అవగాహన కలగడంతో పాటు పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. 15 నుంచి 18 ఏళ్లలోపు బాలికలతో ఏర్పాటవుతున్న పొదుపు సంఘాల ద్వారా సామాజిక చైతన్యం కూడా పెరగనుంది. జిల్లాలో దాదాపు 6వేల మంది కిశోర బాలికలు ఉన్నారు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడానికి సర్ప్ అధికారులు, సిబ్బంది అంగన్‌వాడీ, పాఠశాలలు, కళాశాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఫ దివ్యాంగులు, వృద్ధులతో ప్రత్యేక సంఘాలు
జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులతో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో స్త్రీ ,పురుష బేధం లేకుండా దివ్యాంగులందరిని స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12243 మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు. ఇందులో ఇప్పటికే 1194 మంది దివ్యాంగులు సంఘాల్లో ఉన్నారు. మిగతా 11149 మందిలో అర్హులను గుర్తించి సంఘాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన మహిళలను స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలతో ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. వృద్ధులు తమ కుటుంబాల కోసం జీవితాంతం కష్టపడి చివరి దశలో అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, విసుగు, ఆర్థిక అభద్రత, ఆరోగ్య సహకరించకపోవడం, భయం, ఒంటరితనం, భవిష్యత్తుపై ప్రణాళిక లేకపోవడం, నియంత్రణ కోల్పోవడం, ఆత్మస్థైర్యం దెబ్బతినడం వంటి సమస్యలను గుర్తించి స్వయం సహాయక సంఘాల్లో ఉన్న వృద్ధులకు భరోసా కల్పించే దిశగా సంఘాలు పనిచేసే విధంగా చేయనున్నారు. పది మందితో సంఘాలను ఏర్పాటు చేస్తారు.
ఫ కొత్త సంఘాల ఏర్పాటు ఇలా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తించి నూతన సభ్యత్వ నమోదుతో కొత్త సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30 లోగా కొత్త సంఘాల నిర్మాణం పూర్తిచేసే దిశగా కార్యాచరణ చేపట్టింది. కిశోర బాలికలను అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా గుర్తిస్తున్నారు. దివ్యాంగులను ఓటర్ జాబితా, జాబ్ కార్డులు, సదరం సర్టిఫికెట్లు ద్వారా గుర్తిస్తారు. ఇప్పటికే కొందరు సంఘాల్లో ఉన్న వారిని మినహాయించి సంఘాల్లో లేని సభ్యుల వాస్తవ స్థితిని తెలుసుకుంటారు. వారి వివరాలను సెర్ప్ పోర్టల్‌లో నమోదు చేసి కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తారు.
ఫ ఈనెల 30 వరకు స్పెషల్ డ్రైవ్..
- చిదురాల శ్రీనివాస్, అదనపు డీఆర్‌డీవో
కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులతో కొత్త ఎస్‌హెచ్‌జీ ఏర్పాటుచేసి అర్హులను చేర్చుకుంటాం. ఈనెల 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి జిల్లా సమైక్య, మండల సమైక్య కమిటీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.