Share News

ష్‌.. గప్‌ చుప్‌..

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:35 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం రోజులపాటు పల్లెలో హోరెత్తిన ప్రచారం ముగిసిపోగా, పోటీలో ఉన్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఓటుకు నోటుకు, ఇంటింటా మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ష్‌.. గప్‌ చుప్‌..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం రోజులపాటు పల్లెలో హోరెత్తిన ప్రచారం ముగిసిపోగా, పోటీలో ఉన్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఓటుకు నోటుకు, ఇంటింటా మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలంగా మారింది.

ఫ తొలి విడతలో 76 సర్పంచ్‌, 519 వార్డు స్థానాలకు ఎన్నికలు

జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో 85 సరంచ్‌, 758 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటిలో 9 మంది గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 9 సర్పంచ్‌ స్థానాలతో పాటు 229 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్‌ స్థానాల్లో 295 మంది అభ్యర్థులు, 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రుద్రంగి మండలంలో సర్పంచ్‌ అభ్యర్థులు 10 మంది, వార్డు అభ్యర్థులు 91 మంది, వేములవాడలో సర్పంచ్‌ అభ్యర్థులు 47మంది, వార్డు అభ్యర్థులు 218 మంది, వేములవాడ రూరల్‌ మండలంలో సర్పంచ్‌ అభ్యర్థులు 52 మంది, వార్డు అభ్యర్థులు 262 మంది, కోనరావుపేటలో సర్పంచ్‌ అభ్యర్థులు 122 మంది, వార్డు అభ్యర్థులు 459 మంది, చందుర్తిలో సర్పంచ్‌ అభ్యర్థులు 64 మంది, వార్డు అభ్యర్థులు 347 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

ఫ పల్లెల్లో మద్యం, నగదు జాతర

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తోనే మద్యం, విందులు నడుస్తుండగా తొలివిడత ప్రచారం ముగిసిపోవడంతో అభ్యర్థులు మద్యం, నగదు జాతర మొదలుపెట్టారు. ఓటుకు నోటుగా భావిస్తూ అభ్యర్థులు గెలుపు కోసం ఖర్చుకు వెనకాడడం లేదు. సర్పంచ్‌ అభ్యర్థులు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు, వార్డు అభ్యర్థులు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఇంటింటికి మద్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు రవాణా ఖర్చులతో పాటు నజరానాలు ఇచ్చి రప్పించుకుంటున్నారు. దీంతో ఉపాధి, ఉద్యోగం, చదువుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇళ్లకు చేరడంతో పల్లెల్లో కుటుంబ సందడి కూడా కనిపిస్తోంది.

జిల్లాలో పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. తొలి విడతలు పోటీపడుతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఓటు అనుకూలిస్తుందా లేదా అనే టెన్షన్‌ మాత్రం అభ్యర్థులను వీడడం లేదు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్ల చుట్టూ పరుగులు తీస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో 24 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తెలిపోతుంది. ఓటర్లలోను గెలుపోటములపై ఆసక్తి ఏర్పడింది.

Updated Date - Dec 10 , 2025 | 01:35 AM