Share News

శంభో శంకరా.. హర హర మహాదేవా..

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:34 AM

శంభో శంకరా.. హర హర మహాదేవా.. ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల స్మరణతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం సోమవారం మార్మోగింది.

శంభో శంకరా.. హర హర మహాదేవా..

వేములవాడ కల్చరల్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శంభో శంకరా.. హర హర మహాదేవా.. ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల స్మరణతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం సోమవారం మార్మోగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది వరకు భక్తులు రాజన్న దర్శనానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో పట్టణ పురవీధులు, ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారిపోయాయి. ఉదయాన్నే భక్తులు ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరాజరాజేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో సుమారు 6 గంటలు నిరీక్షించి ఆలయానికి చేరుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోగా ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బ్రేక్‌దర్శనం క్యూలైన్‌లోను భక్తుల తాకిడి కనిపించింది. శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీలక్ష్మీగణపతిని, శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతాలయాలను సందర్శించిన భక్తులు మొక్కులు చెల్లించుకోగా, శివకల్యాణం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న ఆలయం ఎదుట రావిచెట్టు వద్ద దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం ముందు భాగంలోని దారి పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఘనంగా మహాలింగార్చన..

శావ్రణ మాసం నాలుగో సోమవారం సందర్భంగా రాజన్న ఆలయం ఉదయం 5.30 గంటలకు అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.05 గంటలకు శ్రీస్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులతో పాటుగా ఆలయ ఈవో రాధాబాయి హాజరై లింగాకృతిలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ విభాగాలను పరిశీలించిన ఈవో..

శ్రావణ మాసం నాలుగో సోమవారం సందర్భంగా రాజన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈవో రాధాబాయి పలు విభాగాల్లో ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. కోడెల క్యూలైన్‌లు, బ్రేక్‌దర్శనం, ధర్మగుండం, ఉచిత దర్శనం క్యూలైన్‌లతో పాటుగా ఓపెన్‌స్లాబ్‌ ప్రాంతాలను పరిశీలించారు. వెంట ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:34 AM