అడ్డాల కోసం అన్వేషణ
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:08 AM
జిల్లాలో వైన్‌షాపుల లైసెన్స్‌ల ఖరారు ప్రక్రియ ముగియడంతో లైసెన్స్‌లు పొందిన వారు దుకాణాల ఏర్పాటుకు అడ్డాల అన్వేషణలో పడ్డారు. కొత్తగా లైసెన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు 2025 డిసెంబరు 1 నుంచి తమ వ్యాపారాలను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- రెంట్ అగ్రిమెంట్ ఉంటేనే మద్యం వ్యాపారులకు లైసెన్స్ జారీ
- కరీంనగర్ నాలుగు క్లసర్లలో 29 వైన్‌షాపులు
కరీంనగర్ క్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైన్‌షాపుల లైసెన్స్‌ల ఖరారు ప్రక్రియ ముగియడంతో లైసెన్స్‌లు పొందిన వారు దుకాణాల ఏర్పాటుకు అడ్డాల అన్వేషణలో పడ్డారు. కొత్తగా లైసెన్స్‌లు దక్కించుకున్న వ్యాపారులు 2025 డిసెంబరు 1 నుంచి తమ వ్యాపారాలను కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్తగా లైసెన్స్‌లు పొందిన వ్యాపారులకు వైన్‌షాపుల ఏర్పాటుకు అద్దె దుకాణాలు లభించటం కష్టంగా మారింది. జిల్లాలో 25 నుంచి 30 శాతం వరకు కొత్తవారికే వైన్‌షాపుల లైసెన్స్‌లు లభించాయి. ప్రస్తుతం నడుస్తున్న వైన్‌షాపుల యజమానులు అడ్డాలను కొత్తగా లైసెన్స్ పొందిన వారికి దొరకకుండా ఆ షాపుల్లో కొంత వాటా, రెట్టింపు అద్దెను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని షాపులను గుడ్‌విల్ చెల్లించి కొనుగోలు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో జాతీయ రహదారులకు 220 మీటర్ల దూరం, బడి, గుడికి 100 మీటర్ల దూరంగా ఉండాలనే నిబంధనలతో వైన్‌షాపుల ఏర్పాటుకు స్థలాలు దొరకడం కష్టంగా మారింది. కొందరు ఖాళీ స్థలాల్లో తాత్కాళికంగా షెడ్‌లను ఏర్పాటు చేసి వైన్‌షాపులను నిర్వహించటానికి సన్నద్దమవుతున్నారు.
ఫ క్లస్టర్ విధానంతో షాపుల మధ్య పోటీ...
ఎక్సైజ్ శాఖ ప్రవేశపెట్టిన క్లస్టర్ విధానంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ప్రాంతాల్లో ఒక క్లస్టర్ పరిధిలో 8 వరకు వైన్‌షాపుల ఏర్పాటుకు అనుమతించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్నంతటిని నాలుగు క్లస్టర్‌లుగా విభజించి 10 నుంచి 20 డివిజన్‌లు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసిన ఆ క్లస్టర్‌లో 6 నుంచి 8 వైన్‌షాపులు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని నిబంధనలు విధించారు. ఒక క్లస్టర్‌లోని షాపులకు సరైన అడ్డాలు లభించని సందర్భంలో పక్కనక్కనే ఏర్పాటు చేసుకునే అవకాశముంటుంది. దీంతో షాపుల మద్య పోటీ ఎక్కువవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ బ్యాంక్ గ్యారంటీ, షాపు స్థల పరిశీలన తరువాత లైసెన్స్‌లు
మద్యం షాపుల లైసెన్స్‌లు ఖరారు అయిన 94 వైన్‌షాపుల లైసెన్స్ ఫీజు ఏడాదికి 55.45 కోట్ల రూపాయలు. ఇందులో ఆరో వంతు ఎక్సైజ్ ఫీజు 9,24,17,000 రూపాయలు లైసెన్స్‌దారులు ప్రభుత్వానికి చెల్లించారు. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు 94 వైన్‌షాపుల లైసెన్సీలకు కన్ఫర్‌మేషన్ లెటర్లు అందజేశారు. మిగతా లైసెన్స్‌ఫీజుకు 25 నెలల వాలిడిటితో బ్యాంక్ గ్యారంటీలు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒక వంతు లైసెన్స్‌ఫీజును వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. వైన్‌షాపు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనేది సంబంధిత ఎక్సైజ్ సీఐకి అద్దె దుకాణం, పర్మిట్ గది మ్యాప్, రెంట్ అగ్రిమెంట్‌తో, రెండు ఫొటోలు, నౌకర్‌నామా సహా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా షాపు స్థలాన్ని పరిశీలించిన ఎక్సైజ్ అధికారులు నిబంధనల ప్రకారం గుడి, బడికి వంద మీటర్ల దూరం, జాతీయ రహదారికి 220 మీటర్ల దూరం, షాపునకు ఒకటే ప్రవేశ ద్వారం, ఆ షాపునకు ఆనుకుని 100 మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ గది, తాగునీరు, మూత్రశాలలు, పార్కింగ్, సీసీ కెమెరాలు ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఆ తరువాతనే నవంబరు 30న ప్రొవిజినల్ లైసెన్స్‌లను జారీ చేసి అదే రోజు మద్యం డిపో నుంచి స్టాక్ కొనుగోలుకు అనుమతిస్తారు. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి.