రేపటి నుంచి ఒంటి పూట బడి
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:25 AM
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

కరీంనగర్ టౌన్, మార్చి 13: వేసవి ప్రారంభంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించాలని సూచించింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యాసంవత్సరం చివరిరోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలను పునః ప్రారంభిస్తారు.
12.30కు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, తరగతుల నిర్వహణ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. దీనితో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటి పూట బడుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించినందున ఆ సమయంలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో పాఠశాలకు వెళ్లడం, ఇంటికి పిల్లలను తీసుకురావడం ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
21 నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు డిసెంబరు నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, గాలి, వెలుతురు, మంచినీటి వసతి, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున పరీక్షా కేంద్రాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా సమయానికి ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.