Share News

కిశోర బాలికల పొదుపు మంత్రం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:47 AM

జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భద్రత, సామాజిక గుర్తింపునిచ్చిన మహిళా సంఘాలు మరింత విస్తృతమవుతున్నాయి. 60 ఏళ్లు దాటిన కారణంగా గతంలో సంఘాల నుంచి తొలగించిన మహిళలకు తిరిగి సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా జిల్లాలో అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు.

కిశోర బాలికల పొదుపు మంత్రం

-15-18 ఏళ్ల బాలికలతో ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు

-వృద్ధులు, దివ్యాంగులతో ప్రత్యేక గ్రూపులు

-బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చేలా నిర్ణయం

-నెలాఖరులోపు బ్యాంకు ఖాతాలు తెరిపించడమే లక్ష్యం

జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భద్రత, సామాజిక గుర్తింపునిచ్చిన మహిళా సంఘాలు మరింత విస్తృతమవుతున్నాయి. 60 ఏళ్లు దాటిన కారణంగా గతంలో సంఘాల నుంచి తొలగించిన మహిళలకు తిరిగి సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా జిల్లాలో అధికారులు కార్యాచరణ చేపడుతున్నారు. దీంతో మళ్లీ సంఘంలో చేరి తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని తోటి సభ్యులతో పంచుకునే అవకాశం వృద్ధ మహిళలకు లభించనుంది. కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులకు సహకార సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఇందిరా మహిళా శక్తి మిషన్‌లో భాగంగా ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.

ఫకిశోర బాలికలకు చాన్స్‌...

జిల్లాలో 15 నుంచి 18 ఏళ్లలోపు సుమారు 2 వేల మంది బాలికలు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ బాలికలతో కిశోర బాలికల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారికి డబ్బులు పొదుపు చేయడంతో పాటు బ్యాంకింగ్‌ లావాదేవీలపై అవగాహన కల్పిస్తారు. అలాగే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, మహిళలపై వేధింపులు, సోషల్‌ మీడియా ద్వారా జరిగే మోసాలతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘాల్లో బాలికలను చేర్పించడం కోసం సెర్ప్‌ అధికారులు, సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు.

ఫదివ్యాంగ సంఘాల్లో పురుషులూ...

జిల్లా వ్యాప్తంగా సుమారు 1,47,103 లక్షల మంది దివ్యాంగులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దివ్యాంగులందరినీ స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వీరితో కూడా బ్యాంక్‌ ఖాతాలు తెరిపించడం, పొదుపు అలవాటు చేయడంతో పాటు సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చూడనున్నారు. దివ్యాంగులకు అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను ఈ సంఘాల ద్వారా పంపిణీ చేసే అవకాశముంది. ఈ సంఘాల్లోని దివ్యాంగులకు మహిళా సంఘాలకు ఇచ్చినట్లే వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘంలో ఏడు నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈనెలాఖరులోపు బ్యాంకు ఖాతాలు తెరిపించి లింకేజీ రుణాలు ఇవ్వడానికి అనుగుణంగా ప్రక్రియ చేపట్టారు.

ఫ60 ఏళ్లు దాటిన వారికి మళ్లీ అవకాశం..

ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన మహిళలను స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 60 ఏండ్లు దాటిన మహిళలతో మళ్లీ కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏ ఆసరా లేని వృద్ధ మహిళలుంటే చిరు వ్యాపారాలు చేసుకునేందుకు సాయం చేయడం, కొడుకులు సరిగా చూసుకోకపోతే ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంలో సంఘాలు సాయం చేయనున్నాయి. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామని ఫీల్‌ కాకుండా నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్ధేశ్యంతో ఇలాంటి సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఫకార్యాచరణ ఇలా..

జిల్లాలో కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈనెల 12వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించారు. ఈనెల 14వ తేదీ వరకు గ్రామాల్లో ఏ సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, కౌమార బాలికలను డీపీఎంలు, సీసీలు ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గుర్తింపు పూర్తి చేశారు. ఈనెల 15వ, 16వ తేదీల్లో కొత్త సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత సంఘాలు సాధించిన ఆర్థిక విజయాలు చెప్పడమే కాకుండా ఆయా సభ్యుల అనుభవాలు, నిబంధనలు పరిచయం చేస్తారు. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముందుకు వచ్చే సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసి, వారితో బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు తెరిపిస్తారు. వివరాలు సెర్ప్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయిస్తారు.

అవగాహన కల్పిస్తున్నాం

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులకు, వృద్ధులకు నూతన సంఘాల్లో సభ్యత ్వం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ లక్ష్యం మేరకు కొత్త సంఘాల ఏర్పాటును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.

జిల్లా వివరాలు..

మొత్తం మండలాలు 20

స్వయం సహాయక మహిళా సంఘాలు 15,019

సభ్యులు 1,77,250

గ్రామైఖ్య మహిళా సంఘాలు 565

మండల సమాఖ్య సంఘాలు 18

జిల్లా సమాఖ్య సంఘం 1

Updated Date - Aug 15 , 2025 | 01:47 AM