యువతలో స్ఫూర్తి నింపేందుకు సర్దార్ @ 150 యూనిటీ మార్చ్
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:04 AM
యువతలో స్ఫూర్తి నింపేందుకు సర్దార్ ః 150 యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ (మై భారత్) పోర్టల్ నేతృత్వంలో యూనిటీ మార్చ్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
గణేశ్‌నగర్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): యువతలో స్ఫూర్తి నింపేందుకు సర్దార్ ః 150 యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ (మై భారత్) పోర్టల్ నేతృత్వంలో యూనిటీ మార్చ్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేరా యువ భారత్ కరీంనగర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్‌కుమార్ మాట్లాడారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఆదర్శాల సాధనకు జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందు వరుసలో నిలవాలని విజ్ఞప్తి చేశారు. సర్దార్ వల్లభాయి పంటేనే దార్శనికతతో, దృఢ సంకల్పంతోనే భారత్‌లో హైదరాబాద్ విలీనమైందన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ అందించిన స్ఫూర్తితో జాతీయ సమగ్రత, ఏకత, యువజన భాగస్వామ్యం వంటి ఆదర్శభావనలను ఒక ఉత్సవంగా జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మేరా యువ భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం వెంకట రాంబాబు మాట్లాడుతూ సర్దార్ ః 150 యూనిటీ మార్చ్‌లో భాగంగా యువతను భాగస్వాములను చేస్తూ రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రతిజ్ఞలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ’మై భారత్‘ సహకారంతో వికసిత్ భారత్ పాదయాత్రలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ అంశాలపై డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ నెల 6న ప్రచారం ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. మొదటి విడతలో ఈ నెల 31 నుంచి నవంబరు 25 వరకు జిల్లా స్థాయి పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి బి రవీందర్, పాదయాత్ర జిల్లా కన్వీనర్ జి శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ డాక్టర్ తిరుపతి, డీవైఎస్‌వో వి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.