రహదారులకు మోక్షం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:21 AM
జిల్లాలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో జిల్లాలో పలు రోడ్లకు మోక్షం లభించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 412.36 కిలోమీటర్ల మేరకు 34 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపుతూ 868 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో జిల్లాలో పలు రోడ్లకు మోక్షం లభించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 412.36 కిలోమీటర్ల మేరకు 34 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపుతూ 868 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. కేంద్ర రహదారులు, మౌలిక సదుపాయల నిధి (సీఆర్‌ఐఎఫ్) కింద రాష్ట్రానికి మంజూరైన 868 కోట్ల నిధుల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గానికి 150 కోట్లు కేటాయించారు.
ఫ నెరవేరనున్న గన్నేరువరం వాసుల చిరకాల వాంఛ
మానేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలనే గన్నేరువరం మండల వాసుల చిరకాల వాంఛ కేంద్రం విడుదల చేసిన నిధులతో తీరనున్నది. మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను పలు మార్లు కలిశారు. వంతెన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు, గుండ్లపల్లి పాతూరు రోడ్డు, బావుపేట-ఖాజీపూర్ రోడ్డు నిర్మాణం వల్ల గన్నేరువరంతో పాటు, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల రవాణా కష్టాలు తీరనున్నాయి.
ఫ మరో రెండు రోడ్లకు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యంతో పాటు, బీజేపి నాయకులు పలు మార్లు కేంద్ర మంత్రి దృష్టికి ఆర్నకొండ-మల్యాల రోడ్డు నిర్మించాలని ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పిం ఆర్నకొండ-మల్యాల రోడ్డుకు 50 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కృషి చేశారు. చొప్పదండి నియోజక వర్గంలోని అర్నకొండ నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు 35 కిలోమీటర్ల మేర రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ రోడ్డు విస్తరణతో చొప్పదండి నియోజక వర్గంలోని 15 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది. వేములవాడ నుంచి సిరికొండ వరకు రోడ్డు నిర్మాణానికి గాను 23 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు.
ఫ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకుంటా
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
గన్నేరువరం-కొత్తపల్లి వరకు మానేరుపై హైలెవల్ వంతెన నిర్మాణంతోపాటు, వేములవాడ-సిరికొండ, ఆర్నకొండ-మల్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. రాజకీయాలకు తావులేకుండా పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీల నేతలను కలుపుకుపోతున్నామన్నారు. అందులో భాగంగా కేశవ పట్నం నుంచి సైదాపూర్, కొడిమ్యాల నుంచి గోవిందారం మీదుగా తాండ్రియాల, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుంచి ముస్తాబాద్ మండలం బండలింగాపూర్ వరకు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను, చందుర్తి నుంచి మోత్కురావుపేట మధ్య బ్రిడ్జి, రామడుగు మండంలోని కిష్టంపల్లి బ్రిడ్జి, శంకరపట్నం మండలంలోని అర్కండ్ల కెనాల్ వద్ద హైలెవల్ బ్రిడ్జిసహా అనేక ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. దశలవారీగా ఆయా ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర వేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు.