గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:45 AM
గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. విద్యార్థిని లాస్యకు ల్యాప్‌టాప్, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని వేములవాడలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతో పాటు అన్నింటా ముందుండాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం అభినందనీయమని అన్నారు. పట్టుదల, ప్రణాళికబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. విద్యార్థిని జాతీయ స్థాయిలో నిలవడం అభినందనీయమని పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అన్నపూర్ణ, అకాడమిక్ కో-ఆర్డినేటర్ రాంబాబులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, పాఠశాల డీన్ విజయ్‌కుమార్, రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.