అధ్వానంగా గ్రామీణ రోడ్లు
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:38 AM
దశాబ్దకాలంగా పల్లెరోడ్లకు మరమ్మతులు కరువయ్యాయి.
చొప్పదండి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): దశాబ్దకాలంగా పల్లెరోడ్లకు మరమ్మతులు కరువయ్యాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచి ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని ఆర్నకొండ నుంచి గోపాల్‌రావుపేటకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. మండలంలోని రాగంపేట, రేవెల్లి, పెద్దకుర్మపల్లి, దేశాయ్‌పేట గ్రామాలతో పాటు రామడుగు, పెగడపల్లి గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. రుక్మాపూర్ నుంచి కాట్నపల్లి వరకు 2002లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద బీటీ రోడ్డు నిర్మించగా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఫలితంగా రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది. కాట్నపల్లి, కోనేరుపల్లి, మల్లన్నపల్లి, సాంబయ్యపల్లి, గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. కోనేరుపల్లి గ్రామానికి కాకతీయ కాలువ వెంబడి మట్టిరోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుండగా రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. రుక్మాపూర్ నుంచి కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్‌పేట రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డు ఇప్పటి వరకు మట్టి రోడ్డుగా కొనసాగుతుండగా ప్రతి సారి వానాకాలంలో రోడ్డు మొత్తం బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు అనేక చోట్ల దెబ్బతినగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్లుకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.