Share News

ఆర్టీసీలో సమ్మెకు సై

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:37 AM

కరీంనగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్‌ మోగనుంది. టీజీఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో లేబర్‌ కమిషన్‌ కమిషన్‌ కార్యాలయానికి తరళివెళ్లి సమ్మె తేదీని ప్రకటించారు. మే 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రీజియన్‌లో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కరీంనగర్‌-1, కరీంనగర్‌-2, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, గోదావరిఖని, మంథని డిపోలు ఉన్నాయి.

ఆర్టీసీలో సమ్మెకు సై

- సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఆర్టీసీ జేఏసీ

- మే 7 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటన

కరీంనగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్‌ మోగనుంది. టీజీఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో లేబర్‌ కమిషన్‌ కమిషన్‌ కార్యాలయానికి తరళివెళ్లి సమ్మె తేదీని ప్రకటించారు. మే 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రీజియన్‌లో 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కరీంనగర్‌-1, కరీంనగర్‌-2, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, గోదావరిఖని, మంథని డిపోలు ఉన్నాయి. కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా 3,290 మంది ఉద్యోగులు ఉండగా, ఆర్టీసీ సంస్థ బస్సులు 470, ప్రైవేట్‌ హైర్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు కలుపుకుని 423 ఉన్నాయి. గత బీఆర్‌ఎస్‌ పాలన చివరలో ఆర్టీసీలో సమ్మె ఉదృతంగా కొనసాగింది. చివరి ఆసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తర్వాత కాంగ్రస్‌ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మెనిఫెస్టో రూపొందించి 16 నెలలుగడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీలో ఒకటి రెండు యూనియన్లు మినహా అన్ని జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ సమ్మెకు శంఖారావం పూరించారు. జనవరి 27వ తేదీ సమ్మె నోటీసు అందించారు. ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వం, లేబర్‌ కమిషన్‌ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో ఈ నెల7వ తేదీన చలో లేబర్‌ కమిషన్‌ కార్యాలయం చేపట్టి మే7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.

ఫ సమస్యలు పరిష్కరించి వేతన సవరణ చేపట్టాలి

ఆర్టీసీ కార్మికుల 2021 వేతన సవరణ కాలపరిమితి ముగిసిందని, వెంటనే వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు. 2017 వేతన సవరణ జరిగినా, నేటికీ ఎరియర్స్‌ రాకపోవడం, రిటైర్డ్‌ ఉద్యోగులకు వేతన సవరణ ఫిక్సేషన్‌ చేయకపోవడం, 2017 అలవెన్సులు అమలు చేయకుండా పాత అలవెన్సులనే నేటికీ అమలు చేస్తున్నారని సంఘాలు అంటున్నాయి. బ్రెడ్‌ విన్నర్‌ స్కీంలో ఇచ్చే ఉద్యోగాలు కన్సాలిడేటెడ్‌ విధానంలో కాకుండా రెగ్యులర్‌ బెసిస్‌లో ఉండాలంటున్నారు. ఒక్కో డ్రైవర్‌ 500 నుంచి 600 కిలోమీటర్ల మేర బస్సులను నడపడం సాధ్యంకాని పని అంటున్నారు. డ్రైవర్లకు బ్రీత్‌ ఎనలైజర్ల టెస్టుల పేరుతో డ్రైవర్లను సస్పెన్షన్‌కు గురి చేస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. సమ్మె నోటీసులో 21 అంశాలను ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం సమ్మె అనివార్యమైందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

ఫ ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం

- ఎం థామస్‌రెడ్డి, జేఏసీ వైస్‌ చైౖర్మన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌

ప్రభుత్వాలు, సంస్థ చర్యలతో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో విలీనం అంశం ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఈవీ బస్సులను తీసుకువచ్చి డిపోలన్నింటినీ ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిపోలను ప్రైవేట్‌ పరం చేశారు. ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు సన్నద్ధం కావాలి. తక్షణమే యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఫ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- జక్కుల మల్లేశం గౌడ్‌, ఎస్‌డబ్ల్యుయు ఐఎన్‌టియుసి, రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ

ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబులు చొరవ తీసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పీఆర్‌సీ 21శాతం కార్మికులకు అందించింది. 2017 ఎరియర్స్‌, డీఏలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశం, యూనియన్ల ఎన్నికల పునరుద్ధరణ, పేస్కేల్‌ పెండింగ్‌ బకాయిలు అందించాలని కార్మికులు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:37 AM