మున్సిపల్ కార్మికులకు రూ. 30 లక్షల ప్రమాద బీమా
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:39 PM
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. మున్సిపల్ సమావేశ మందిరంలో వారధి సొసైటీ ద్వారా పారిశుధ్య కార్మికులకు పీపీఈ శానినేషన్ కిట్లను మంగళవారం పంపిణీ చేశారు.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. మున్సిపల్ సమావేశ మందిరంలో వారధి సొసైటీ ద్వారా పారిశుధ్య కార్మికులకు పీపీఈ శానినేషన్ కిట్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ద్వారా కార్మికులకు చెల్లించే ఈఎస్‌ఐని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్ విధానంతో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సిబ్బంది, ఎలక్ర్టిసిటీ, హరితహారం, నీటి సరఫరా విభాగాల్లో పనిచేసే కార్మికులందరికీ 30 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపచేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా కార్మికులకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తామన్నారు. వాటి ఫలితాలు పొందేందుకు ప్రతి కార్మికుడు పూర్తిస్థాయి వివరాలు ఉండేలా ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. కార్మికులకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినపుడు నగరపాలక సంస్థకు సమాచారం అందించాలన్నారు. నగరపాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారని, మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్మికులు పనిచేసే సమయాల్లో పీపీఈ కిట్లను తప్పకుండా వినియోగించాలన్నారు. కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల రక్షణ ధ్యేయంగా ప్రతి కార్మికుడికి బీమా డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడికి 18 నెలలకు ఒకసారి వారధి సొసైటీ ద్వారా గ్లౌజులు, షూస్, యాప్రాన్లు, మాస్కులు, సబ్బులు, ఆయిల్ తదితర వస్తువులతో కూడిన పీపీఈ కిట్లను అందిస్తున్నామన్నారు. కార్మికులు సిక్ లీవ్ కింద వెళితే కార్యాలయానికి సమాచారమివ్వాలని, దీంతో ఈఎస్‌ఐ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకునే వీలుంటుందని చెప్పారు. కొత్తగా నగరపాలక సంస్థకు పారిశుధ్య వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. పారిశుధ్య పనులు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి కార్మికుడు ఆ దిశగా పనిచేయాలని సూచించారు. పారిశుధ్య విభాగం జవాన్ శ్యాంసుందర్ మృతికి మౌనం పాటించి నివాళులర్పించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, హెల్త్ ఆఫీసర్ సుమన్, వారధి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.