రైతుల ఖాతాల్లో రూ. 206.64 కోట్లు
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:22 AM
వానాకాలం సాగుకు రైతు భరోసా సాయం సకాలంలో అందడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఈ నెల 24న సచివాలయంలో రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వానాకాలం సాగుకు రైతు భరోసా సాయం సకాలంలో అందడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఈ నెల 24న సచివాలయంలో రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతులు ఆ కార్యక్రమాన్ని వీక్షించారు. దీంతో ఈ కార్యక్రమం ఈ విడతకు పూర్తయినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలో 1,90,195 మంది రైతులకు 206.64 కోట్ల రూపాయలు అందాయి. జిల్లాలో 1,90,606 మంది రైతుల ఖాతాల్లో 207,12,04,857 రూపాయలు జమ చేశారు. 411 మంది రైతులకు వారి వారి బ్యాంకు ఖాతాలు, ఇతర సమస్యల కారణంగా జమ చేసిన డబ్బు వారి ఖాతాల్లో చేరలేదు. దీంతో 47,78,114 రూపాయలు ఆ రైతులకు అందలేదు. ఈ సీజన్‌లో 2,10,904 మంది రైతులకు 211,90,69,841 రూపాయలు రైతు భరోసా సాయంగా అందించాల్సి ఉందని గుర్తించారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు వారి పట్టాదారు పుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర సమాచారం వ్యవసాయ అధికారులకు అందించాలని కోరారు. ఆయా రైతులు అందించిన సమాచారం మేరకు 1,97,524 మంది రైతుల ఖాతాలను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. 1,90,606 మంది రైతులకు మాత్రమే డబ్బు ట్రెజరీకి పంపించారు. వివరాలు అప్‌లోడ్ చేసిన రైతుల్లో ఇంకా 6,828 మందికి రైతు భరోసా సాయాన్ని పంపించాల్సి ఉన్నది. విజయోత్సవ సభ అయిన రోజు నుంచి కొత్తగా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ట్రెజరీకి డబ్బు పంపించినట్లు ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. దీంతో ఆ రైతులకు ఈ సీజన్‌కు డబ్బు వస్తుందా, రాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే సోమ, మంగళవారాల్లో బ్యాంకు ఖాతాలకు డబ్బు రాని పక్షంలో ఈ సీజన్‌కు ఇక ఇంతే కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫ మానకొండూర్ మండలంలో అత్యధికం
జిల్లాలో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 20,146 మంది రైతులకు 21.86 కోట్ల రూపాయలు రైతు భరోసా సాయంగా అందింది. అత్యల్పంగా కరీంనగర్ అర్బన్ మండలంలో 12 మంది రైతులు 1.58 లక్షల రూపాయలు పొందారు. ఈ విడతలో చొప్పదండి మండలంలో 13,317 మంది రైతులకు, గంగాధర మండలంలో 14,388, రామడుగు మండలంలో 13,902, ఇల్లందకుంట మండలంలో 10,707, హుజూరాబాద్ మండలంలో 13,672, జమ్మికుంట మండలంలో 12,398, సైదాపూర్‌లో 13,819, వీణవంకలో 14,557 మంది రైతులకు రైతు భరోసా సాయం అందింది. కరీంనగర్ రూరల్ మండలంలో 11,059 మంది రైతులకు, కొత్తపల్లి మండలంలో 7,043, చిగురుమామిడి మండలంలో 12,757, గన్నేరువరం మండలంలో 7,003, శంకరపట్నం మండలంలో 13,658, తిమ్మాపూర్ మండలంలో 11,757 మంది రైతులకు రైతు భరోసా సాయం అందింది.